JAGAN: ప్రశ్నించే గొంతును కోసేసిన వైసీపీ

JAGAN: ప్రశ్నించే గొంతును కోసేసిన వైసీపీ
వైసీపీ సమన్వయకర్తల మూడో జాబితా ప్రకటన.... ప్రశ్నించిన వారికి మొండిచెయ్యి చూపిన జగన్‌

పశ్నించే గొంతును కోస్తారని వైసీపీ సమన్వయకర్తల మూడో జాబితా ప్రకటనతో అధికార వైసీపీ అధిష్ఠానం మరోసారి రుజువు చేసింది. ‘దళితులుగా పుట్టడం మేం చేసిన నేరమా? పాపమా? నేనేం తప్పు చేశాను? వ్యతిరేకత దళితులమైన మా సీట్లలోనే ఉందా? డబ్బులు ఇస్తే ఐప్యాక్‌ వాళ్లు ఎవరి తలరాతలైనా మారుస్తారా? అంటూ ప్రశ్నించిన..... పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబును పక్కన పెట్టేశారు. ఆ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా..... డాక్టర్‌ మూతిరేవుల సునీల్‌కుమార్‌ను నియమించారు. సునీల్‌ 2014-19మధ్య ఇదే పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. బాబుకు అన్యాయం చేసినట్లే 2019లో సునీల్‌ను పక్కను పెట్టారు. ఆయన అవమానభారంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో అప్పట్లో సంచలనమైంది. ఇప్పుడు అయిదేళ్ల తర్వాత మళ్లీ ఆయన్నేఇన్‌ఛార్జిగా ఎంపిక చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ టెక్కలి నియోజవర్గంలో అరాచకాలు చేస్తున్నారని ఆయన భార్యే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయటంతో.. శ్రీనివాస్‌ను తప్పించి ఆయన భార్య వాణిని సమన్వయకర్తగా నియమించారు. కొన్నినెలలు గడవకుండానే తిరిగి దువ్వాడ శ్రీనివాస్‌నే టెక్కలి సమన్వయకర్తగా నియమించారు.


రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ పిలిచి మాట్లాడారు. ఈసారి కూడా మీరే కొనసాగుతారని చెప్పి పంపారు. తాజాగా ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డిని సమన్వయకర్తగా ప్రకటించారు. మల్లికార్జున రెడ్డి 2019 ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. ఆ పదవిని, అధికారాన్ని వదులుకుని అప్పట్లో వైసీపీలో చేరారు. అధికారంలోకొస్తే మంత్రి పదవిస్తామని వైసీపీ పెద్దలు ఆయనకు హామీనిచ్చారు. ఏ పదవీ ఇవ్వకపోగా ఇప్పుడు టికెట్టే గల్లంతు చేశారు. మూడో జాబితాలో ఓ మంత్రి తమ్ముడు అసెంబ్లీ, మరో మంత్రి కొడుకును లోక్‌సభకు పంపారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ సోదరుడు డాక్టర్‌ ఆదిమూలపు సతీష్‌ను.... తాజాగా కర్నూలు జిల్లా కోడుమూడు (ఎస్సీ) నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. అక్కడ సిటింగ్‌ ఎమ్మెల్యే సుధాకర్‌ను పక్కన పెట్టేశారు. సురేష్‌ బావ డాక్టర్‌ తిప్పేస్వామి ప్రస్తుతం మడకశిర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ను ఈసారి మార్చకపోతే సురేష్‌ కుటుంబంలో మూడు టికెట్లు ఇచ్చినట్లవుతుంది.


తణుకు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌ను ఏలూరు లోక్‌సభ బాధ్యుడుగా నియమించారు. విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని నానిని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జెడ్పీ ఛైర్‌పర్సన్‌ పిరియ విజయకు ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ బాధ్యత అప్పగించారు. ఉమ్మడి కృష్ణా జెడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాళ్ల హారిక భర్త ఉప్పాళ్ల రామును పెడన అసెంబ్లీ నియోకజవర్గ బాధ్యుడిగా నియమించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురంలో ప్రస్తుత సమన్వయకర్తగా ఉన్న పిరియ సాయిరాజ్‌ను తప్పించి ఆ సీటును ఆయన భార్య పిరియ విజయకు అప్పగించారు.

తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు అసెంబ్లీకి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తిరుపతి లోక్‌సభకు మార్చారు. మంత్రి గుమ్మనూరు జయరాంకు ఎక్కడా సీటు ఉండదనే ప్రచారం విస్తృతంగా జరిగింది. మూడు రోజులపాటు పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి చుట్టూ తిరిగిన ఆయన ఎట్టకేలకు కర్నూలు లోక్‌సభ సీటును దక్కించుకోగలిగారు. ఇన్ చార్జీల మార్చుతూ ఇప్పటివరకు 3 జాబితాలను విడుదల చేసిన వైసీపీ మొత్తం 51 అసెంబ్లీ ఇన్ చార్జీలు, 8 పార్లమెంట్ ఇన్ చార్జీలను మార్చింది. మొత్తంగా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్‌ లేదని తేల్చేశారు. మూడు జాబితాల్లో.. కలిపి 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు లేవని జగన్ మొండి చేయి చూపారు.

Tags

Read MoreRead Less
Next Story