BOTSA: మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం

BOTSA: మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం
X
చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎలా ఇచ్చిందో తెలియట్లేదన్న బొత్స

ఆంధ్రప్రదేశ్‌లో తాము ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అదే తమ పార్టీ విధానమని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిందో తెలియడం లేదని బొత్స అన్నారు. వైసీపీ జిల్లా కార్యాలయాలపై జరుగుతున్న రాద్దాంతం సరికాదన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు వెళ్లి.. వాటిని పరిశీలించడం తగదని బొత్స అన్నారు. ఇటీవల విజయనగరంలోని వైసీపీ కార్యాలయాన్ని టీడీపీ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పరిశీలించడాన్ని బొత్స తప్పుబట్టారు.

నేడే డీఎస్సీ నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో.. మరోసారి టెట్ నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. నేడు టెట్ జులై-2024 నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే డీఎస్సీ‌తోపాటు టెట్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మొదట టెట్ నిర్వహించి, ఆ తర్వాత డీఎస్సీ నిర్వహణకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా నేడు టెట్‌ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ జూన్ 30న తెలిపారు.

ఇవాళ నోటిఫికేషన్‌ విడుదల అయితే అభ్యర్థుల ద్వారా రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని సురేష్‌కుమార్‌ తెలిపారు. ఏపీటెట్ నోటిఫికేషన్, షెడ్యూలు, సిలబస్‌‌తపాటు పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, విధివిధానాలు రేపటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్‌ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 2.35 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 1,37,903 మంది మాత్రమే అర్హత సాధించారు. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం గత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. కొత్తగా 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ఇటీవల బీఈడీ, డీఎడ్‌ పాసైన అభ్యర్థులతో పాటు, గత టెట్‌లో ఫెయిలైన వారికి అవకాశం కల్పిస్తూ కొత్తగా టెట్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు.

Tags

Next Story