AP: సీఎం జగన్‌ ఒంటెద్దు పోకడ వల్లేనా..?

AP: సీఎం జగన్‌ ఒంటెద్దు పోకడ వల్లేనా..?
వరుసగా పార్టీని వీడుతున్న వైసీపీ ప్రజా ప్రతినిధులు..... పార్టీని వదిలే దారిలోనే మరికొందరు

వైసీపీలో ఎంపీలు, ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి, ఎంపీ పదవికీ రాజీనామా చేశారు. తన స్థానంలో మరో అభ్యర్థిని నియమించేందుకు అధిష్ఠానం యత్నిస్తుండడంతో అవమాన భారంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ చేసిన సర్వేల్లో కృష్ణ దేవరాయలుకు అనుకూలంగా నివేదికలొచ్చాయి. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలంతా శ్రీకృష్ణనే ఎంపీ అభ్యర్థిగా కొనసాగించాలని నాలుగైదు సార్లు నేరుగా ముఖ్యమంత్రినే కలిసి పట్టుబట్టారు. వారెంత మొత్తుకున్నా కొత్త అభ్యర్థిని తెచ్చేందుకే సీఎం జగన్‌ మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడ వల్లే ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీని వీడారని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. ఈ ఎంపీ, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, వినుకొండలో ఒక మాజీ ఎమ్మెల్యే చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇప్పుడు ఎంపీ పార్టీని వీడడంతో ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది.


ఇప్పటికే కర్నూలు, మచిలీపట్నం ఎంపీలు డాక్టర్‌ సంజీవ్‌కుమార్, వల్లభనేని బాలశౌరి పార్టీకి, ఎంపీ పదవులకీ రాజీనామా చేసేశారు. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి , కాపు రామచంద్రా రెడ్డి కూడా పార్టీని వీడారు. రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరగా తాను, తన భార్య రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని రామచంద్రారెడ్డి ప్రకటించేశారు. వైసీపీకి గుడ్‌బై చెప్పేందుకు మరికొందరు కూడా సిద్ధమవుతున్నారు. ఆలూరులో తనను తప్పించి జడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షిని పార్టీ సమన్వయకర్తగా నియమించడంపై మంత్రి గుమ్మనూరు జయరాం..తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పలుమార్లు సంప్రదింపుల తర్వాత సీఎం ఆయన్ను కర్నూలు లోక్‌సభ సమన్వయకర్తగా నియమించారు. కానీ అప్పటి నుంచి మంత్రి పెద్దగా బయటకు రావడం లేదు. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన మరుసటి రోజు తన వర్గీయులతో ఆయన సమావేశమయ్యారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు తన నిర్ణయం ఉంటుందని, తనకు అనేక అవకాశాలున్నాయని చెప్పడం ద్వారా.. ఆయన వైసీపీ అధిష్ఠానానికి హెచ్చరిక జారీ చేశారు.

ఓ వర్గం పెత్తనంలో తనకు అన్యాయం జరిగిందంటున్న నందికొట్కూరు ఎస్సీ ఎమ్మెల్యే ఆర్థర్‌ తన వర్గీయులతో ఇటీవలే చర్చించారు. మరో పార్టీలో చేరాలా? స్వతంత్రంగా బరిలోకి దిగాలా అనేదానిపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తానంటున్నారు. తెలుగుదేశం ఎంపీ కేశినేని నానీని వైసీపీలోకి తీసుకునే కుట్రలో భాగంగానే తనకు అన్యాయం చేశారని తిరువూరు ఎస్సీ ఎమ్మెల్యే రక్షణనిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పిలిపించినా కలిసేందుకు ఆయన వెళ్లలేదు. రెండు మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన అంటున్నారు. ఒంగోలు సిటింగ్‌ స్థానాన్ని మాగుంట శ్రీనివాసులురెడ్డికి కాకుండా కొత్త అభ్యర్థికి ఇస్తామని చెబుతున్నారు. ఫలితంగా మాగుంట కూడా వైసీపీలో కొనసాగే అవకాశం లేదని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story