AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలు..? 6 నెలల ముందే..

AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలు అనివార్యమేనా..? అధికార వైసీపీ ఇదే వ్యూహాలు రచిస్తోందా..? ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారా..? రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి గెలవాలంటే తప్పకుండా ముందస్తు ఎన్నికలు వెళ్లాల్సిందే అన్న భావనలో వైసీపీ అధినేత జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు రాజకీయ సలహాలు ఇస్తున్న పీకే టీమ్ కూడా ఇదే మార్గం మంచిదని సూచించినట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో టీడీపీ క్రమంగా బలపడుతుండడం.. మహానాడు, బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలతో పాటు చంద్రబాబు పర్యటనలకు భారీ స్థాయిలో జనాదరణ లభిస్తుండడంతో…జగన్ టీమ్‌లో ఓటమి భయం ఆవహించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో కేసీఆర్ అనుసరించిన విధానాన్నే పాటిస్తూ.. షెడ్యూల్ కన్నా ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్లాలని.. వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి సన్నాహకంగా ఈ నవంబర్ నుంచి బస్సు యాత్ర చేపట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం.
మరోవైపు.. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కూడా పీకే టీమ్ సర్వే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గడప గడపకు కార్యక్రమం చేపట్టి ఎమ్మెల్యేల్లో ప్రజల పట్ల ఉన్న స్పందన ఏంటో గ్రహించాలన్నది… పీకే, జగన్ వ్యూహంగా తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు ప్రజల నుంచి నిరసన సెగ ఎదుర్కొన్నారు. వీరందరి జాబితాను పీకే టీమ్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అన్ని వడపోతలు పూర్తి చేశాక.. 3 నుంచి 6 నెలల ముందు అభ్యర్థుల ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. రానున్న ఎన్నికల్లో ఎవరికి అవకాశం వస్తుంది.. ఎవరికి అవకాశం రాదన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అయితే అధిష్టానం వైఖరి ఏంటన్నది ఇప్పటికే అగ్రశ్రేణి నాయకత్వానికి అర్థం అయిపోయినట్లుంది. అందుకే ఎవరు ఉంటారో ఎవరు పోతారో అంతా అధినేత ఇష్టం అంటూ నాయకులు వరుసగా హింట్లు ఇస్తూనే ఉన్నారు… అటు అధినేత జగన్ కూడా ఇదే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ఎవరూ తమకు టికెట్ ఖాయం అనే భావనలో ఉండొద్దని… పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో జగన్ స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లి మంచిమార్కులు తెచ్చుకున్నవారికే టికెట్ అంటూ కుండబద్ధలు కొట్టేశారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఎవరి సీటు ఉంటుందో.. ఎవర్ని పక్కకు పెడతారోనని వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com