SHARMILA: జగనన్న... అప్పటి అన్న కాదు

SHARMILA: జగనన్న... అప్పటి అన్న కాదు
జగన్‌పై షర్మిల తీవ్ర విమర్శలు... తనపై దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన

ముఖ్యమంత్రి అయ్యాక జగన్ పూర్తిగా మారిపోయారని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల ఆరోపించారు. కడపలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో షర్మిల వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైకాపా కోసం నిస్వార్థంగా పని చేస్తే తనపై రోజుకో కట్టుకథ పుట్టించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి రోజుకో జోకర్ బయటకు వచ్చి దుష్ర్పచారం చేస్తున్నారని, వాటికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను సీఎం చేయాలని తన భర్త అనిల్ ప్రణబ్ ముఖర్జీని అడిగారని ఒక కట్టుకథ పుట్టించారని షర్మిల ఆరోపించారు. గతంలో జగన్ సతీమణి భారతీరెడ్డితో కలిసే తన భర్త సోనియాగాంధీ వద్దకు వెళ్లారని వెల్లడించారు. ఈ విషయం గురించి భారతీరెడ్డి ఏమైనా సాక్ష్యం చెబుతారా అని షర్మిల ప్రశ్నించారు. ఆడపిల్ల అని కూడా చూడకుండా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారన్న ఆమె సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఎన్ని అవరోధాలు కల్పించినా ఏపీ ప్రజల హక్కుల కోసం పోరాటం సాగిస్తానని షర్మిల స్పష్టం చేశారు.


అంతకుముందు షర్మిల వివేక కుమార్తె సునీత ఇడుపులపాయ ఎస్టేట్ లో కలిశారు రెండు గంటలకుపైనే సాగిన ఈ సమావేశంలో ఇద్దరు రాజకీయ అంశాలపై చర్చించినట్టు తెలిసింది మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య తర్వాత ఐదేళ్ల నుంచి సీఎం జగన్ ,ఎంపీ అవినాష్ రెడ్డిపై ఒంటరి పోరు చేస్తున్న సునీతకు షర్మిల అండగా నిలబడ్డారు. ఇప్పుడు ఇద్దరూ సమావేశం కావడం, వైఎస్ కు నివాళులర్పించడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో కడప లేదా పులివెందుల నుంచి జగన్ ను బలంగా ఢీకొనాలంటే ఆ కుటుంబం నుంచే కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచనతో షర్మిల సునీతతో సమావేశమైనట్టు తెలుస్తోంది.


అనంతరం Y.S.R జిల్లా ఖాజీపేటలో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు. డీఎల్ రవీంద్రారెడ్డి, షర్మిల మధ్య అరగంట పాటు చర్చలు సాగాయి. ఈ సందర్భంగా డీఎల్ రవీంద్రారెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ సీనియర్లందరినీ పార్టీలోకి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు షర్మిల చెప్పారు.

‘‘వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా తన మార్క్ రాజకీయం, సంక్షేమ పాలన అందించారు. అదిప్పుడు జగనన్న పాలనలో ఎక్కడ ఉంది. వైకాపాని అధికారంలోకి తీసుకొచ్చేందుకు 3,200 కి.మీ పాదయాత్ర చేశా. అలాంటిది ఇప్పుడు నాపైన మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. రోజుకొకరితో నాపై వ్యక్తిగతంగా దూషణలు చేయిస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీతో నా భర్త అనిల్ కలిసి రాజకీయం చేశారని మాట్లాడుతున్నారు. జగన్‌ను జైల్లో పెట్టి నేను ముఖ్యమంత్రి కావాలని అనిల్ కోరినట్లు విష ప్రచారం చేస్తున్నారు. అదంతా అబద్ధమని షర్మిల అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story