SUNITHA: అవినాష్.. మా గురించి ఆలోచించావా..
వివేకానందరెడ్డి దారుణ హత్య విషయంలోనూ రాజకీయాలే చూస్తారా అని వివేకా కుమార్తె సునీత అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. హత్య తర్వాత తన కుటుంబసభ్యులు ఇబ్బందులు పడుతున్నారని, తన తండ్రి జైల్లో ఉన్నారని అవినాష్ చెప్పడంపై సునీత మండిపడ్డారు. తన తండ్రి హత్య తర్వాత తన కుటుంబం గురించి ఏనాడైనా అవినాష్ ఆలోచించారా అని ప్రశ్నించారు. గూగుల్ టేకౌట్ ఫ్యాబ్రికేటెడ్ అని అవినాష్ చెప్పడాన్ని తప్పుపట్టిన సునీత... ఆ నివేదికను సీబీఐ, సర్వే ఆఫ్ ఇండియా, ఎఫ్‌ఎస్‌ఎల్ కలిసి తయారు చేశాయని గుర్తుచేశారు. వివేకా హత్యకేసులో దస్తగిరి అప్రూవర్ అయినంత మాత్రాన తప్పించుకునే అవకాశం లేదని సునీత అన్నారు. కేసు దర్యాప్తు ఆలస్యం అవుతోందంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి.. పోలీసులతోగానీ, సీబీఐతోగానీ ఈ విషయంపై ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తే ఎలా? దారుణ హత్య విషయంలోనూ రాజకీయాలే చేస్తారా? అని మండిపడ్డారు. రాజకీయాలే కాకుండా ప్రతి ఒక్కరికీ జీవితం కూడా ఉంటుందని గుర్తించాలని హితవు పలికారు.
‘‘తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నామని అవినాష్ అంటున్నారు. వివేకా కుటుంబం గురించి ఏమైనా ఆలోచించారా?వివేకా హత్యకేసు దర్యాప్తు గురించి పోలీసులతో, సీబీఐతో ఎప్పుడైనా మాట్లాడారా? గూగుల్ టేకౌట్ ఫ్యాబ్రికేటెడ్ అని అంటున్నారు. గూగుల్ టేకౌట్ రిపోర్టును సీబీఐ, సర్వే ఆఫ్ ఇండియా, ఎఫ్‌ఎస్‌ఎల్ తయారు చేశాయి. అవినాష్‌పై సర్వే ఆఫ్ ఇండియా, ఎఫ్‌ఎస్‌ఎల్‌కు కూడా కోపం ఉంటుందా? మీ ఫోన్ దర్యాప్తు అధికారికి ఇవ్వండి. కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.
మీకోసం వివేకా ప్రచారం చేశారన్నారు. అది నిజమే. మీ కోసం అంతగా కష్టపడిన వ్యక్తి కోసం మీరేం చేశారు. అవినాష్ ఎంపీగా.. జగన్ సీఎంగా ఉన్నారు. మాకు న్యాయం చేశారా? వివేకా చేసిన మంచిపనుల గురించి ఈ ఐదేళ్లలో ఒక్కమాట చెప్పారా? మీ కోసం కష్టపడిన వ్యక్తి గురించి ఒక్కసారైనా మీ పత్రికలో రాశారా? పార్టీ కోసం ఎంతో కష్టపడిన షర్మిలకు 2014లో సీటు ఎందుకు ఇవ్వలేదు? ప్రజలకు ఏం చేశారని అవినాష్‌రెడ్డికి సీటు ఇచ్చారు. వివేకా ఆఖరి కోరిక తీర్చే బాధ్యత మీకు లేదా? ఆ అవకాశం అవినాష్‌కు ఉంది. పోటీ నుంచి తప్పుకొని షర్మిలకు మద్దతివ్వండి. కడప జిల్లా ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా హంతకులకు ఓటు వేయొద్దు. మీకోసం పోరాడే వారికి ఓటు వేయండి. మేం సీబీఐని ప్రభావితం చేస్తున్నామంటే ఎవరైనా నమ్ముతారా? ఐదేళ్లుగా కేసు ముందుకెళ్లడం లేదంటే ఎవరి సత్తా ఏంటో అర్థమవుతోంది. వివేకాను దూరం పెట్టామని విమర్శిస్తున్నారు. నా భర్త, తండ్రి కలిసి కొరియా ట్రిప్ వెళ్లారు. దూరంగా ఉంచితే ఎలా కలిసి ప్రయాణం చేస్తారు?’’ అని సునీత ప్రశ్నించారు.
అంతకుముందు వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత తనపై ఆధారాల్లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని..వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలతో నరకం అనుభవిస్తున్నానని చెప్పారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి వివేకానందరెడ్డి ఇంటి వద్ద ఉదయంస 4 గంటల సమయంలో సంచరించారని గూగుల్ టేకౌట్ ద్వారా గుర్తించినట్లు సీబీఐ చెప్పిందన్న ఆయనఆ సమయంలో అక్కడున్నంత మాత్రాన తప్పుడు కేసు పెడతారా అని ప్రశ్నించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com