Number Plate : కారు కంటే నంబర్ ప్లేటే ఖరీదు..వేలంలో రూ.2.08 కోట్లు పలికిన నంబర్ DDC 001.

Number Plate : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. విలాసవంతమైన కార్లు, ఖరీదైన మేడలు కొనడం మనకు తెలుసు. కానీ, కేవలం ఒక నంబర్ ప్లేట్ కోసం ఒక వ్యక్తి ఏకంగా రూ.2.08 కోట్లు ఖర్చు చేశారు.గుంటూరుకు చెందిన ఒక వ్యాపారవేత్త ఇండియాలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించారు.
విలాసవంతమైన కార్ల విక్రయాలలో పేరుగాంచిన బిగ్ బాయ్ టాయ్జ్ సంస్థ తాజాగా తన ఆక్షన్ హౌస్‌ను ప్రారంభించింది. ఇక్కడ కేవలం కార్లనే కాకుండా, అత్యంత అరుదైన వింటేజ్ వస్తువులను, ఖరీదైన వాచీలను, విఐపి నంబర్ ప్లేట్లను వేలం వేస్తున్నారు. ఈ వేలంలోనే DDC 001 అనే వింటేజ్ నంబర్ ప్లేట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నంబర్ కోసం దేశంలోని పలువురు కుబేరులు పోటీ పడగా, చివరకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన కిరణ్ కొలపాకుల రికార్డు స్థాయిలో రూ.2.08 కోట్లు వెచ్చించి దీనిని దక్కించుకున్నారు.
సాధారణంగా ఒక మంచి లగ్జరీ కారు ధర రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుంది. కానీ కిరణ్ కొన్న ఈ నంబర్ ప్లేట్ ధరతో రెండు మూడు లగ్జరీ కార్లను కొనేయవచ్చు. ఇంత భారీ ధర పలకడానికి ప్రధాన కారణం ఆ నంబర్ ప్లేట్ వింటేజ్ విలువ, 001 అనే సంఖ్యకు ఉన్న క్రేజ్. బిగ్ బాయ్ టాయ్జ్ యజమాని జతిన్ అహుజా ఈ నంబర్ ప్లేట్‌ను వేలంలో పెట్టినప్పుడు ఇంతటి భారీ స్పందన వస్తుందని ఊహించలేదని ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నారు. "ఇది చరిత్ర.. ఇంత పారదర్శకమైన వేలంలో వింటేజ్ వస్తువుల విలువ ఏంటో మరోసారి నిరూపితమైంది" అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
గతంలో హర్యానాలో ఒక విఐపి నంబర్ (HR 88 B 8888) రూ.1.17 కోట్లు పలికిన వార్త వైరల్ అయ్యింది. అయితే, ఆ వేలంలో గెలిచిన వ్యక్తి నిర్ణీత సమయంలో డబ్బు చెల్లించకపోవడంతో ఆ డీల్ రద్దయ్యింది. కానీ ఇప్పుడు కిరణ్ కొలపాకుల కట్టిన రూ.2.08 కోట్లు భారతదేశ చరిత్రలోనే ఒక నంబర్ ప్లేట్ కోసం చెల్లించిన అత్యధిక ధరగా నిలిచిపోయింది. దీనితో గుంటూరు పేరు మరోసారి జాతీయ స్థాయిలో మార్మోగిపోతోంది.
కేవలం నంబర్ ప్లేట్లే కాకుండా, ఈ ఆక్షన్ హౌస్‌లో సెలబ్రిటీలు వాడిన వస్తువులను కూడా వేలం వేస్తున్నారు. శిల్పా శెట్టికి చెందిన మెర్సిడెస్ మేబ్యాక్, రోహిత్ శెట్టి వాడిన మెర్సిడెస్ బెంజ్, క్రికెటర్ దినేష్ కార్తీక్ రేంజ్ రోవర్ కార్లను కూడా ఇక్కడ విక్రయిస్తున్నారు. అలాగే అరుదైన మొబైల్ నంబర్లు (ఉదాహరణకు 999999999X వంటివి), అత్యంత ఖరీదైన రోలెక్స్ వాచీలు కూడా ఈ వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సంపన్నులు తమ హోదాను చాటుకోవడానికి ఇలాంటి అరుదైన వస్తువుల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి.
గుంటూరు కిరణ్ కొన్న ఈ నంబర్ ప్లేట్ ఇప్పుడు ఏ కారుకు అమరుస్తారో అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ఖరీదైన నంబర్లను కోట్ల విలువ చేసే రోల్స్ రాయిస్ లేదా లంబోర్గిని వంటి కార్లకు వాడుతుంటారు. ఏది ఏమైనా, ఒక నంబర్ ప్లేట్ కోసం రూ.2 కోట్లు ఖర్చు చేయడం అనేది సామాన్యులకు అందని వింతే అయినా, కలెక్టర్లకు మాత్రం అదొక ప్యాషన్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
