10₹ Note Shortage: తెలుగు రాష్ట్రాల్లో రూ.10 నోట్ల కొరత

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల రూ.10 నోట్ల కొరత ఏర్పడుతోంది. మార్కెట్లో రూ.10 నోటు చలామణి తగ్గిందని, ఎక్కువగా చిరిగిన నోట్లే కనిపిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కొరత వాస్తవమేనని బ్యాంకు అధికారులు తెలిపారు. ఇండెంట్ పెడితే RBI నుంచి రూ.20, రూ.50, రూ.100 నోట్లే వస్తున్నాయని, రూ.10నోట్లు రావడం లేదంటున్నారు. అయితే రూ.10 కాయిన్లు చెల్లుబాటులోనే ఉన్నాయన్నారు.
కరోనా తరువాత డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఆన్‌లైన్ చెల్లింపులకు అలవాటు పడిపోయారు. ఏ దుకాణానికి వెళ్లినా, ఏ వస్తువు కొనాలన్నా డిజిటల్ చెల్లింపులు పని చేస్తున్నాయా? అనే పరిస్థితి నెలకొంది. చిన్నపాటి చెల్లింపులకు ఫోన్‌పే, గూగుల్‌పే వంటివి ప్రత్యేకంగా వ్యాలెట్ రూపంలో సులభతర చెల్లింపులు అనుమతిస్తున్నాయి.
వీధి వ్యాపారులు, చిన్న దుకాణాల్లో సైతం డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. దీంతో రూ.5, రూ.10ల లావాదేవీలకు కూడా వినియోగదారులు నోట్లు ఇవ్వడంలేదు. క్రమంగా రూ.10ల నోటు బదలాయింపు జరగకపోవడం వల్ల వ్యాపారులు, వినియోగదారుల వద్ద అందుబాటులో లేకుండా పోయింది. విపణిలో ప్రస్తుతం చిరిగిన రూ.10 నోట్లు దర్శనమిస్తుండటం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com