Bhojpuri Actress : రోడ్డు ప్రమాదంలో ప్రముఖ భోజ్‌పురి నటి మృతి

Bihar : బీహార్‌లోని కైమూర్‌లో ఫిబ్రవరి 25న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ భోజ్‌పురి నటి ఆంచల్ తివారీ మరణించారు. దీంతో పాటు గాయకుడు ఛోటూ పాండే కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది మరణించారు. ఇందులో భోజ్‌పురి సినిమాకి చెందిన నలుగురు నటులు ఉన్నారు.
బీహార్‌లోని కైమూర్ జిల్లాలో ట్రక్కు, ఎస్‌యూవీ, మోటార్‌సైకిల్ ఢీకొన్న ఘటనలో భోజ్‌పురి గాయకుడు ఛోటూ పాండే సహా తొమ్మిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వీరితో పాటు, భోజ్‌పురి నటి సిమ్రాన్ శ్రీవాస్తవ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు.
పంజాబ్ కేసరి కథనం ప్రకారం, మోహానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్‌కాలీ గ్రామ సమీపంలోని జిటి రోడ్డులో ఈ సంఘటన జరిగింది. మృతులను గుర్తించామని, వారిలో భోజ్‌పురి గాయకుడు విమలేష్ పాండే అలియాస్ ఛోటు పాండే కూడా ఉన్నారని మోహానియా డీఎస్పీ దిలీప్ కుమార్ తెలిపారు. మృతులు ఆంచల్ తివారీ, సిమ్రాన్ శ్రీవాస్తవ, ప్రకాష్ రామ్, దాధిబాల్ సింగ్, అను పాండే, శశి పాండే, సత్య ప్రకాష్ మిశ్రా, బగీష్ పాండేలుగా గుర్తించారు.
బీహార్ సిఎం నితీష్ కుమార్ కూడా ఈ సంఘటనకు సంతాపం తెలుపుతూ తన X ఖాతాలో, ''కైమూర్ జిల్లాలోని మోహానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని NH 2లో దేవ్‌కలి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు మరణించడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని సూచనలు చేశాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం" అని రాశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com