Road Accident : ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బైక్.. ముగ్గురు మృతి

జగిత్యాల– నిజామాబాద్ జాతీయ రహదారిపై కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు చనిపోయారు. పోలీసుల కథనం ప్రకారం..ఏపీ నుంచి వలస వచ్చిన బడికెల వేణు (40) జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట్ గ్రామంలో ఉంటూ తాపీ పని చేస్తున్నాడు. మెట్ పల్లిలో ఓ బిల్డింగ్ నిర్మాణ పనుల కోసం కొండగట్టు దిగువన ఉండే శ్రీకాంత్, వెంకటేశ్‌తో కలిసి బైక్‌పై బయల్దేరాడు. కోరుట్ల మండలం వెంకట్రావ్‌పేట్ శివారులో రోడ్డు పక్కన ఆగి ఉన్న రాజస్థాన్‌కు చెందిన లారీని ఢీ కొట్టారు. దీంతో కొమురం వెంకటేశ్(33), పసులేటి శ్రీకాంత్ (27) అక్కడికక్కడే చనిపోయారు. వేణుగోపాల్ తీవ్రంగా గాయపడగా జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మరణించాడు. లారీ డ్రైవర్ పరారయ్యాడు. కోరుట్ల ఎస్సై కిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్‌కు ఎవరూ లేకపోవడంతో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. వేణు గోపాల్‌కు భార్య జ్యోతితో పాటు ఎనిమిది, ఆరేండ్ల వయస్సున్న ఇద్దరు కొడుకులున్నారు. శ్రీకాంత్ భార్య శిరీష ఏడు నెలల గర్భిణి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com