Crime : భార్యను తన్నబోయి.. జారిపడి భర్త మృతి

భార్యతో గొడవపడిన ఓ భర్త తాగిన మైకంలో ఆమెను తన్నబోయి జారి పడి చనిపోయాడు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కనికి గ్రామపంచాయతీ పరిధిలోని ఎడ్లగూడకు చెందిన కట్టెకోళ్ల శంకర్ (36 ) తాగుడుకు బానిసయ్యాడు. శంకర్ తన భూమిని కౌలుకు ఇవ్వగా ఈనెల 2న కౌలుకు తీసుకున్నవారు రూ. 36 వేలు ఇచ్చారు. సోమవారం బాగా తాగిన శంకర్ బీరువాలో ఉన్న కౌలు డబ్బులు తీస్తుండగా గమనించిన అతడి భార్య కవిత అడ్డుకునే ప్రయత్నం చేసింది.
మత్తులో ఉన్న శంకర్ తననే అడ్డుకుంటావా అంటూ ఆమెను కాలితో తన్నేందుకు వెళ్లాడు. కవిత తప్పించుకోగా శంకర్ కాలు జారి గడప మీద పడ్డాడు. తల వెనుకవైపు బలమైన గాయం కావడంతో రక్తస్రావమైంది. కుటుంబసభ్యులు అతడిని కౌటాల పీహెచ్ సీకి, అక్కడ నుంచి కాగజ్‌నగర్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.
అప్పటికే శంకర్ చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. మృతుడి తల్లి రాంబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మధుకర్ తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ సాదిక్ పాషా పరిశీలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com