Road Accident : ఓటేయడానికి వెళ్తూ... ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురి మృతి

లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకని సొంత ఊరికి బయలు దేరిన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. రోడ్డు పక్కన టిఫిన్ చేస్తుండగా దూసుకొచ్చిన ఆర్టీసీ రాజధాని ఎక్స్‌ప్రెస్ బస్సు ముగ్గురి ప్రాణాలు తీసింది. జనగామ జిల్లా రఘునాథపల్లిలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. వరంగల్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ తోటకు చెందిన తెల్కపల్లి రవీందర్ కుటుంబసభ్యులు ఉపాధి కోసం యాదాద్రి జిల్లా బీబీనగర్‌కు వెళ్లారు. ఐదేళ్లుగా అక్కడే ఉంటున్నారు. ఓటు వేసేందుకని పెద్ద కుమారుడైన పార్థును ఇంటి వద్దనే ఉంచి రవీందర్(35) తన భార్య జ్యోతి(32)తో పాటు చిన్న కుమారుడు భవిష్ (10)ను తీసుకొని ద్విచక్ర వాహనంపై వరంగల్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో రఘునాథపల్లిలో జాతీయ రహదారి పక్కన ఆగి టిఫిన్ చేస్తుండగా హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ రాజధాని బస్సు అదుపు తప్పి వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో రవీందర్, జ్యోతి అక్కడిక్కడే దుర్మరణం చెందారు. గాయపడిన భవిష్‌ను ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com