National Highway : విజయవాడ–హైదరాబాద్‌ హైవేపై దారిదోపిడీ

National Highway : విజయవాడ–హైదరాబాద్‌ హైవేపై దారిదోపిడీ
X

నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున దారిదోపిడీ జరిగింది. ఎస్సై సైదాబాబు కథనం మేరకు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం తోట్లపాలెం గ్రామానికి చెందిన పంచాక్షరి–అఖిల దంపతులు. శనివారం తోట్లపాలెం నుంచి పంచాక్షరి–అఖిల దంపతులు, వారి కుమారుడు దేవాంశ్‌, శ్రుతి కలిసి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు.

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తికి వచ్చేసరికి కారును ఆదివారం వేకువజామున 2:30 గంటలకు బస్‌బేలో నిలిపాడు. సుమారు 3.45 గంటల ప్రాంతంలో ఇద్దరు దొంగలు ముఖం కనబడకుండా వస్త్రాలు కట్టుకుని పెద్దబండరాయితో కారు ముందుభాగంలోని కుడి, ఎడమవైపు అద్దాలను ధ్వంసం చేశారు. ముందుసీట్లలో నిద్రిస్తున్న పంచాక్షరిని, శ్రుతిని కారులోంచి బయటకు లాగి రాళ్లతో దాడి చేసి గాయపరిచారు.

పంచాక్షరి వేలికి ఉన్న 10 గ్రాముల బంగారు ఉంగరం, శ్రుతి మెడలోని 10 గ్రాముల బంగారు గొలుసు, అఖిల మెడలోని 3 తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని సమీపంలోని తోటలోకి పారిపోయారు. దుండగుల దాడిలో గాయపడిన పంచాక్షరి, శ్రుతిని గమనించిన ఓ వ్యాన్‌ డ్రైవర్‌ తన వాహనాన్ని ఆపి.. వారిని చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రికి, అక్కడినుంచి నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

Tags

Next Story