TTD : టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష

టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ఆసుపత్రుల డైరెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రముఖ వైద్యులు టీటీడీ ఆసుపత్రులలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోగులకు వైద్య సేవలు అందించే అంశంపై అదనపు ఈవో చర్చించారు. గత ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రివ చంద్రబాబు ఇచ్చిన సూచనల మేరకు శ్రీవారి సేవలో భాగంగా ప్రొఫెషనల్ సేవలను ప్రవేశపెట్టాలనే టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, ముందుగా వైద్య రంగం నుండి ఈ ప్రొఫెషనల్ సేవలను ప్రారంభించడానికి అవసరమైన చర్యలను టీటీడీ ప్ర్రారంభించింది. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ టీటీడీ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందించదలచిన వైద్యులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేయాలని జిఎంఐటి ఇంచార్జ్ ఫణికుమార్ నాయుడును ఆదేశించారు. మొదటిసారి టీటీడీ ప్రొఫెషనల్ సేవలను ప్రవేశ పెడుతున్న కారణంగా ముఖ్యమంత్రి సూచనల మేరకు నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో చీఫ్ పీఆర్వో డా. టీ.రవి, అశ్విని ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ డా. కుసుమ కుమారి, బర్డ్ మెడికల్ సూపరింటెండెంట్ డా. వెంకా రెడ్డి, స్విమ్స్ కు చెందిన డా. ఆలోక్ సచన్ తదితరులు పాల్గొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com