TTD : వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయం వెనుకవైపు గల వసంతోత్సవ మండపంలో గత మూడురోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు మంగళవారం కన్నులపండుగగా ముగిశాయి. తొలిరోజు, రెండవరోజు శ్రీమలయప్పస్వామివారు తన ఉభయదేవేరులతో కలసి వసంతోత్సవంలో పాల్గొనగా చివరిరోజున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పతో పాటుగా శ్రీసీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, శ్రీకుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఒకే వేదిక పై సమస్త మూలవర్లను దర్శించిన భక్తులు తన్మయంతో పులకించారు.
అదేవిధంగా ప్రతినెలా పౌర్ణమినాడు తిరుమలలో నిర్వహించే గరుడసేవను టిటిడి రద్దుచేసింది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయ్యర్, చిన్నజీయ్యర్, ఈవో ఏవి. ధర్మారెడ్డి దంపతులు, జేఈవో గౌతమి సిపిఆర్వో రవి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com