Karthika Pournami : అంతటా కార్తీక పౌర్ణమి శోభ.. వెలుగుతున్న ఆలయాలు

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ కనిపిస్తోంది. ఇంటింటా వాడవాడలా ఆలయాల్లో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో కార్తీక సోమవార వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పౌర్ణమి రోజున స్వామి అమ్మవార్లకు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా, విజయవాడ ఇంద్రకీలాద్రిలో శ్రీ దుర్గాదేవి అమ్మవారి గిరి ప్రదక్షిణ మహోత్సవం నిర్వహించారు. విజయవాడలోని ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఈ గిరి ప్రదక్షిణ ఉదయం 6 గంటలకు ప్రారంభమై దాదాపు మూడు గంటల పాటు సాగింది. ఐదున్నర గంటల సమయంలో ఇంద్రకీలాద్రి కొండ దిగువన అమ్మవారి రథం ఉంచారు. అమ్మవారి ఉత్సవమూర్తులు కూడా ఈ గిరి ప్రదక్షిణలో దర్శన మిచ్చాయి.
కార్తీక పౌర్ణమి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టకు భక్తులు వేలాదిగా పోటెత్తారు. తెల్లవారుజామునే భక్తులు స్నానమాచరించి శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు ఓం నమః శివాయ, హరహర మహాదేవ అంటూ శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. భక్తులు దీపాలు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి తమ కోరికలు తీరాలని మనసారా వేడుకుంటూ.. తమ శక్తి కొలది కొలుచుకుంటూ స్వామి వారి సేవలో తరిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతి రోజూ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. సుమారు రెండు లక్షల భక్తులు స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com