Sri Kapileswara Swamy Temple : జూలై 18 సుందర కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలో జూలై 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం జూలై 17న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
జూలై 18న మొదటిరోజు ఉదయం ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, సాయంత్రం కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహిస్తారు. జూలై 19న రెండో రోజు ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలపూజ, హోమం చేపడతారు. జూలై 20న ఉదయం మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు పంచమూర్తులైన కపిలేశ్వరస్వామి, కామాక్షి అమ్మవారు, విఘ్నేశ్వరస్వామి, సుబ్రమణ్యస్వామి, చండికేశ్వరస్వామివార్లు పుర వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com