Sri Rama Navami : శ్రీరామనవమి రోజున ఏం చేయాలి?

శ్రీరామనవమి రోజున సీతారాములతో పాటు ఆంజనేయుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు. రాముడి తల్లిదండ్రులైన కౌసల్య, దశరథుడిని స్మరించుకోవడం మంచి ఫలితాలనిస్తుంది. దీంతో పాటు సీతారామ కల్యాణం జరిపించడం, ఆ వేడుకల్లో పాల్గొనడం, చూడటం మేలు చేస్తుంది. ఇక స్వామివారికి పానకం, వడపప్పు, చలిమిడి, మామిడిపండ్లు, చక్కెర పొంగలి, చెరకు, ఇప్పపూలు ప్రసాదంగా సమర్పించాలి.
‘శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే.. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ ఈ శ్లోకం చాలా విశిష్ఠమైనదని పండితులు చెబుతారు. ఇది విష్ణుసహస్ర నామంతో సమానమని అంటారు. మన పెదవులు రామ నామంలో ‘రా’ అనే అక్షరాన్ని ఉచ్చరించినపుడు మనలోని పాపాలన్నీ బయటకు వెళ్లిపోతాయని.. ‘మ’ అనే అక్షరాన్ని పలికినప్పుడు లోనికి రాకుండా మూసుకుంటాయని విశ్వసిస్తారు. ‘రామ’ నామాన్ని జపిస్తే పాపాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని నమ్ముతారు.
సీతారాముల కల్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒక్కటి కానున్నారు. ఉదయం 9.30 గంటలకు పెళ్లితంతు మొదలు కానుంది. ఈ వేడుకల కోసం దేవస్థానం, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఆర్టీసీ 238 ప్రత్యేక బస్సులను నడుపుతుండగా.. భద్రాద్రిలో భక్తుల రద్దీ పెరిగిపోవడంతో స్థానికంగా వసతి కష్టంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com