AP : ఏపీలో నేటి నుంచి టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

ఏపీలో టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. టెన్త్ పరీక్షలకు 1,61,877 మంది, రెండేళ్లకు కలిపి 4,67,938 మంది పరీక్షలు రాయనున్నారు. సప్లిమెంటరీ ఫీజు కట్టని టెన్త్ విద్యార్థులకూ పరీక్ష రాసే అవకాశం అధికారులు కల్పించారు. 1.61లక్షల మంది ఫెయిల్ కాగా ఫీజు 1.15 లక్షల మందే చెల్లించారు. పెండింగ్‌లో ఉన్న టెన్త్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు నెలాఖరులోపు విడుదల చేయనున్నారు.
ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించేలా ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి కొత్త విధానం తీసుకురానుంది. ప్రస్తుత సప్లిమెంటరీ పరీక్షల నుంచే దీన్ని ప్రారంభిస్తారు. ఒక్కో అధ్యాపకుడు తమకు పంపిన 50 ప్రశ్నపత్రాలను.. వారి కళాశాలల్లో CC కెమెరాల పర్యవేక్షణలో దిద్దాల్సి ఉంటుంది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరితో ఒక్కో పేపర్ మూల్యాంకనం చేయిస్తారు. అత్యధిక మార్కుల్ని పరిగణనలోకి తీసుకుంటారు.
మరోవైపు తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ పరీక్షలు రాసేందుకు సుమారు 4.27 లక్షల మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. మొదటి, రెండో ఏడాది విద్యార్థుల కోసం రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి సెషన్‌ను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, రెండో సెషన్‌ను మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com