Supreme Court : గృహ హింస సెక్షన్లలో మార్పులు : సుప్రీంకోర్టు
భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 498 ఏ (గృహహింస) దుర్వినియోగం అవుతున్న తీరుపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసుల్లో యాంత్రికంగా వ్యవహరించవద్దని పోలీసులకు.. ఐపీసీ స్థానంలో కొత్తగా తీసుకొస్తున్న భారతీయ న్యాయసంహితలో గృహహింసకు సంబంధించిన సెక్షన్ 85, 86లో తగిన మార్పులు చేయాలని శాసనవ్యవస్థ (లెజిస్లేచర్)కు సూచించింది. అలాగే.. దృఢమైన దాంపత్య బంధానికి సహనమే పునాది అని, భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలని.. చిన్నచిన్న గిల్లికజ్జాలు వచ్చినా సర్దుకుపోవాలి తప్ప.. గోరంత విషయాలను కొండంతలుగా చేసి చూడొద్దని, కాపురాలను కూల్చుకోవద్దని సూచిస్తూ.. తమ ముందుకు వచ్చిన ఓ వరకట్న వేధింపుల కేసును కొట్టేసింది.
హరియాణాకు చెందిన ఒక మహిళ.. తన భర్త తన పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొంటూ, విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై పోలీసులు గృహహింస సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై భర్త హైకోర్టును ఆశ్రయించాడు. తనపై దాఖలు చేసిన క్రిమినల్ కేసును కొట్టేయాల్సిందిగా అభ్యర్థించాడు. కానీ, పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు అతడి అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో అతడు సుప్రీంకు వెళ్లాడు. ఈ కేసులో భార్య తన భర్తపై చేసినవి బలహీనమైన ఆరోపణలని అర్థమవుతోందని.. తనపట్ల అతడి క్రూరప్రవర్తనకు సంబంధించిన ఒక్క నిర్ణీత సంఘటనను కూడా ఆమె వెల్లడించలేదని పేర్కొంటూ.. భర్తపై ఆమె పెట్టిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com