Black Magic : బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడనే అనుమానంతో.. కాలే బొగ్గుపై డ్యాన్స్

మహారాష్ట్రలోని (Maharashtra) థానే జిల్లాలో కొందరు వ్యక్తులు చేతబడి చేశాడనే అనుమానంతో 75 ఏళ్ల వృద్ధుడిని కాలే బొగ్గుపై నృత్యం చేయమని బలవంతం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. మార్చి 4న ముర్బాద్ తాలూకాలోని కెర్వెలె గ్రామంలో జరిగిన ఈ ఘటనలో వ్యక్తికి కాలిన గాయాలయ్యాయని, ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు.
కేసు వివరాలు
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో, కొంతమంది వ్యక్తులు ఆ వ్యక్తిని అతని చేతులతో పట్టుకోవడం, మండుతున్న బొగ్గుపై బలవంతంగా నృత్యం చేయించడంతో ప్రేక్షకులు కేకలు వేస్తూ ఉత్సాహపరిచారు. గ్రామంలోని ఒక దేవాలయం సమీపంలో స్థానికులు ఒక మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయంలో 15-20 మంది వ్యక్తులు ఆ వ్యక్తి ఇంట్లోకి చొరబడి, బయటకు లాగి, సంఘటన స్థలానికి తీసుకెళ్లి, మండుతున్న బొగ్గుపై బలవంతంగా నృత్యం చేపించారని ముర్బాద్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ బాబర్ తెలిపారు. అతను చేతబడి చేస్తున్నాడని ఆరోపిస్తూ గ్రామస్తులు కొందరు అతన్ని కొట్టారని చెప్పారు. ఆ వ్యక్తికి పాదాలు, వీపుపై కాలిన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
ఎఫ్ఐఆర్ నమోదు
అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో, పోలీసులు కొంతమంది వ్యక్తులపై ఐపీసీ సెక్షన్లు 452 (ఇంట్లో అతిక్రమించడం, గాయపరచడం, దాడి చేయడం మొదలైన వాటికి సన్నాహాలు చేయడం) 323, 324 (స్వచ్ఛందంగా గాయపరచడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com