Bihar Former Deputy CM : బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ కన్నుమూత

బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ(72) కన్నుమూశారు. కొన్ని నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ట్వీట్ చేశారు. సుశీల్ కుమార్ మోదీ తన 33 సంవత్సరాల రాజకీయ జీవితంలో రాజ్యసభ, లోక్‌సభ, శాసన మండలి, శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.
72 ఏళ్ల సుశీల్ కుమార్ బిహార్ రాజకీయాల్లో సీనియర్ నేత. 2005 నుంచి 2020 మధ్య సీఎం నీతీశ్ కుమార్ ప్రభుత్వంలో రెండు దఫాలుగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 2020లో ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాసవాన్ మరణంతో ఆయన రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఉప ఎన్నికల్లో ఆ సీటుకు సుశీల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఆయన పదవీకాలం ముగిసింది.
సుశీల్ కుమార్ మోదీ మరణంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘పార్టీలో విలువైన సహచారుడు, నా స్నేహితుడు సుశీల్ మోదీ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. బిహార్‌లో బీజేపీ ఎదుగుదల, విజయానికి సుశీల్ కుమార్ ఘనత వహించారు’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా సంతాపం తెలియజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com