Manmohan Singh : రేపు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు: వేణుగోపాల్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ఆయన భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచనున్నట్లు సమాచారం. ఇప్పటికే కేంద్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఇవాళ దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది.
మన్మోహన్ తన జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. 1932లో ఇప్పటి పాకిస్థాన్‌లోని గాహ్ అనే మారుమూల గ్రామంలో జన్మించి, స్కూల్ విద్యను అక్కడే అభ్యసించారు. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం ఇండియాకు వలస వచ్చింది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో నానమ్మ వద్ద పెరిగారు. 1991, 2008లో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని మన్మోహన్ తన పనితీరుతో గట్టెక్కించారు.
ఎన్నో హోదాల్లో పనిచేసిన మన్మోహన్ ఒకప్పుడు తిండికి కూడా ఇబ్బందులు పడ్డారని ఆయన కూతురు దమన్ సింగ్ ఓ పుస్తకంలో ప్రస్తావించారు. ‘కేంబ్రిడ్జ్ వర్సిటీలో ట్యూషన్ ఫీజు, ఖర్చులు కలిపి ఏడాదికి 600పౌండ్లు అయ్యేది. పంజాబ్ వర్సిటీ 160పౌండ్లు ఇస్తుండేది. తాత డబ్బు సర్దుబాటు కాక పంపడం ఆలస్యమయ్యేది. దీంతో నాన్న కొన్నిసార్లు పస్తులు ఉండేవారు. డబ్బును పొదుపుగా వాడుతూ చాక్లెట్‌తో కడుపు నింపుకునేవారు’ అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com