Indian Political Leaders : జూన్ 1న ఇండియా కూటమి నేతల సమావేశం!

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానుండగా, అంతకుముందే జూన్ 1న ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారట. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారని సమాచారం. మరోవైపు అదే రోజున ఏడో విడత పోలింగ్ జరగనుంది. ఈ భేటీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఆయన ఆ తర్వాతి రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా కోర్టులో సరెండర్ కావాల్సి ఉంది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ సహా కూటమిలోని అన్ని పార్టీల అగ్రనేతలు సమావేశంలో పాల్గొంటారని సమాచారం. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 లోక్‌సభ సీట్లను ఇండియా కూటమి అవలీలగా గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. ఈ ఆశాభావంతోనే ఇప్పుడు జూన్ 1 సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com