Gadkari Secures Hat-trick : గడ్కరీ హ్యాట్రిక్.. నవనీత్ కౌర్ రానా ఓటమి

Gadkari Secures Hat-trick : గడ్కరీ హ్యాట్రిక్.. నవనీత్ కౌర్ రానా ఓటమి
X

మహారాష్ట్రలో అమరావతి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ రానా ఓడిపోయారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థి బల్వంత్ వాంఖడే 19,731 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వాంఖడేకు 5,26,271 ఓట్లు, నవనీత్ రానాకు 5,06,540 ఓట్లు పోలయ్యాయి. నవనీత్ తెలుగులో పలు సినిమాలు చేశారు. మరోవైపు ముంబై నార్త్ స్థానం నుంచి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి భూషణ్‌ పాటిల్‌పై 3.52 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు.

కేంద్ర మంత్రి, నాగ్‌పూర్ బీజేపీ అభ్యర్థి నితిన్ గడ్కరీ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ థాక్రేపై 1.37 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ స్థానంలో ఆయనకు ఇది వరుసగా మూడో విజయం. మరోవైపు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి గజేంద్ర షెకావత్ గెలిచారు. అటు రాజ్‌కోట్‌లో బీజేపీ అభ్యర్థి పర్షోత్తమ్ ఖోడాభాయ్ 4.84 లక్షల ఓట్ల మెజారిటీతో విక్టరీ సాధించారు.

స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీలోని మైన్‌పురి స్థానంలో పోటీ చేసిన ఆమె 2,21,639 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరోవైపు నార్త్ గోవాలో బీజేపీ అభ్యర్థి శ్రీపాద్ నాయక్ వరుసగా ఆరోసారి విక్టరీ అందుకున్నారు. సౌత్ గోవాలో కాంగ్రెస్ అభ్యర్థి విరియాటో ఫెర్నాండెజ్ విజయం సాధించారు.

యూపీలోని సమాజ్‌వాది పార్టీకి చెందిన పుష్పేంద్ర సరోజ్(కౌశాంబి), ప్రియ సరోజ్(మచ్లిషహర్) లోక్‌సభకు ఎన్నికైన అతిపిన్న వయస్కులుగా నిలిచారు. వీరిద్దరూ 25 ఏళ్లకే ఎంపీగా ఎన్నికయ్యారు. మరోవైపు తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ డీఎంకే అభ్యర్థి TR బాలు(82) లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన అతిపెద్ద వయస్కునిగా నిలిచారు.

Tags

Next Story