Kerala : నేడు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు..
నైరుతి రుతుపవనాలు నేడు(గురువారం) కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం వాతావరణం చల్లబడడం, గాలులు వీస్తుండడం, కేరళ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు పడుతుండడంతో రుతుపవనాల ఎంట్రీకి మార్గం సుగమం అయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెమాల్ తుఫాను కారణంగా, నైరుతి రుతుపవనాలు ఈరోజు కేరళ తీరం, ఈశాన్య ప్రాంతాలను తాకవచ్చని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది, అయితే ఈసారి రుతుపవనాలు కేరళలో సమయం కంటే ముందే వస్తున్నాయి. వచ్చే 24 గంటల్లో కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ బుధవారం తెలిపింది.
గతేడాది రుతుపవనాలు అంచనా వేసిన సమయానికంటే ఆలస్యంగా వచ్చాయని, ఇప్పుడు మాత్రం రుతుపవనాల వ్యాప్తికి వాతావరణం అనుకూలంగా ఉందని అధికారులు చెప్పారు. రాబోయే 3, 4 రోజుల్లో ఏపీ, తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో గురువారం పొడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అల్లూరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com