Speaker's Position : స్పీకర్ పదవిపై టీడీపీ, జేడీయూ కన్ను?

ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న టీడీపీ, జేడీయూ పార్టీలు స్పీకర్ పదవిపై కన్నేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు, నితీశ్ ఇద్దరూ ఈ పదవిపై ఆసక్తిగా ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. సంకీర్ణ ప్రభుత్వాల్లో ఏదైనా తిరుగుబాటు తలెత్తితే స్పీకర్ పదవి కీలకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద సభ్యులపై వేటు వేసే శక్తివంతమైన హక్కు ఆ పదవికి ఉంటుంది.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రెండు పార్టీలు సభాపతి స్థానాన్ని ఆశిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా స్పీకర్ సభలో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వాలి. గతంలో స్పీకర్‌గా ఎన్నికైన నీలం సంజీవరెడ్డి పారదర్శకంగా వ్యవహరించేందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇలాంటి ఘటనలు జరగలేదు. అయితే మిత్రపక్షాలకు సభాపతి పదవిని బీజేపీ కట్టబెడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
భారత రాజ్యాంగం ప్రకారం లోక్‌సభ తొలి సమావేశానికి ముందు స్పీకర్ పదవి ఖాళీగా ఉంటుంది. అయితే భారత రాష్ట్రపతి ప్రొటెం-స్పీకర్‌ను నియమిస్తారు. కొత్త ఎంపీల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం సభలో సాధారణ మెజారిటీతో లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. స్పీకర్ ఎన్నికకు ప్రత్యేక నిబంధనలు ఏవీ లేకపోయినా.. రాజ్యాంగం, పార్లమెంటరీ రూల్స్‌ను దృష్టిలో ఉంచుకొని స్పీకర్ ఎన్నికను నిర్వహించాలి. గత రెండు లోక్‌సభల్లో బీజేపీకి స్పష్టమైన అధికారం ఉండడంతో సుమిత్రా మహాజన్, ఓం బిర్లా సాధారణ మెజారిటీతో ఎన్నికయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com