BJP New Chief : మోదీ కేబినెట్‌లోకి నడ్డా.. బీజేపీకి త్వరలో కొత్త చీఫ్?

BJP New Chief : మోదీ కేబినెట్‌లోకి నడ్డా.. బీజేపీకి త్వరలో కొత్త చీఫ్?

బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకి మోదీ 3.0 మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆ పార్టీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నట్లు తెలుస్తోంది. ‘వన్ పర్సన్, వన్ పోస్ట్’ అనే పాలసీని ఆ పార్టీ అనుసరిస్తున్నందున కొత్త చీఫ్‌ను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019 మేలో లోక్‌సభ ఎన్నికల తర్వాత అమిత్‌షా కేంద్ర హోంమంత్రి అయిన తర్వాత 2020లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన నాయకత్వంలోనే బీజేపీ తాజా లోక్‌సభ ఎన్నికలకు వెళ్లింది. అంతకుముందు అమిత్‌షా నాయకత్వంలో బీజేపీ 2014, 2019 ఎన్నికల బరిలోకి దిగింది.

కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరనే దానిపై అనేక చర్చలు జరిగాయి. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రులుగా మారారు కాబట్టి ఇప్పుడు కొత్త పేర్లపై చర్చ మొదలవుతోంది.

లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినందున ఆ రాష్ట్రం నుంచి కొత్త జాతీయ అధ్యక్షుడు రావచ్చని చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో బలహీనపడిందని కూడా చర్చలు జరిగాయి. అయితే ప్రస్తుతం బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మహారాష్ట్రకు చెందిన ఓ నేత పేరు కూడా ప్రచారంలో ఉంది.

Tags

Next Story