CBN: వైసీపీ నేతలు చేసిన తప్పులు చెయ్యొద్దు

టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. 'ఇసుక, లిక్కర్ వ్యాపారాల్లో ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదు. కొత్తగా లిక్కర్ వ్యాపారంలోకి వెళ్లి సంపాదించుకోవాలని చూడకూడదు. మాగుంట ఫ్యామిలీ ఎప్పటి నుంచో లిక్కర్ వ్యాపారంలో ఉంది. అందుకే మాగుంట ఫ్యామిలీకి లిక్కర్ విషయంలో మినహాయింపు ఉంది.' అంటూ చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ నేతలు ఎవరూ విచ్చలవిడిగా ప్రవర్తించవద్దని, ఇసుక, మద్యం వంటి అంశాల్లో తలదూర్చవద్దని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్యనేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు హితవు పలికారు. జాతీయ స్థాయిలో భాగస్వామ్యంగా ఉన్నామని.. మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని చంద్రబాబు తెలిపారు. మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.
తప్పులు చెయ్యొద్దు.
వైసీపీ నేతలు చేసిన తప్పులు చేయవద్దని.. క్రమశిక్షణతో మెలగాలని.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని చంద్రబాబు సూచించారు. ఈ నాలుగు నెలల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పనితీరుకు సంబంధించిన ప్రోగెస్ రిపోర్టు తన దగ్గర ఉందని తెలిపారు. 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ ఎన్నో అరాచకాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేయడం వల్లే 11 స్థానాలకు పడిపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాలు, వైసీపీ వాళ్లు చేస్తున్న దుష్ప్రచారాలు, ఇసుక, మద్యం, పారిశ్రామిక పాలసీలతో పాటు త్వరలో ప్రారంభం కానున్న పార్టీ సభ్యత్వ నమోదుపై టీడీపీ నేతకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైసీపీ నేతల దగ్గర దోచిన సొమ్ము బస్తాలకొద్దీ.. రూ.వేల కోట్లు ఉన్నాయి. ఎన్నికల్లో ఆ డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ ప్రజలు ఓట్లు వేశారా? ‘ఫీల్ గుడ్ ఫ్యాక్టర్’ లేకుండా డబ్బులతో ఏ ఎన్నికలోనూ గెలవలేరు. డబ్బే ప్రధానమైతే మనకు 93 శాతం విజయం దక్కేది కాదని చంద్రబాబు తెలిపారు.
వేల కోట్లు ఉన్నా..
ఎన్నికలకు ముందు వైసీపీ ఎన్నో సర్వేలు చేయించిందని.. వైనాట్ 175 అన్నారని, రూ.వేల కోట్ల మేర దోచుకున్న సొమ్ము పంచారని.. కానీ గెలవలేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఒక నాయకుడికి, పార్టీకి విశ్వసనీయత రావాలంటే చాలా సమయం పడుతుందని, దానిని పోగొట్టుకోవడానికి ఎంతో సమయం పట్టదని, ఇది తనతో పాటు పార్టీలో ఉన్నవారందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచాం కాబట్టి.. చాలనుకుంటే కుదరదని చంద్రబాబు తేల్చి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com