Auto Accident : కొండగట్టులో మళ్లీ ఆటో బోల్తా.. 11 మందికి తీవ్ర గాయాలు

ప్రసన్నాంజనేయ స్వామి కొలువైన కొండగట్టు క్షేత్రం అంటే ఉత్తర తెలంగాణ మొత్తం పులకించి పోతుంది. ఐతే.. ఘాట్ రోడ్డులో తరచూ ప్రమాదాల గురించి తెలిసినప్పుడు ఒళ్లుగగుర్పొడుస్తుంది. స్టేట్ హైవేపైనే ఈ క్షేత్రం ఉండటం ప్రమాదాల తీవ్రతను పెంచుతోంది. వేములవాడలో శివరాత్రి దర్శనం చేసుకున్న భక్తులు.. కొండగట్టుకు వెళ్లడం ఆనవాయితీ. అలా.. శనివారం మార్చి 9న భక్తుల సంఖ్య పెరిగింది.
కొండగట్టు ఘాట్ రోడ్డుపై వెళ్తున్న ఓ ఆటో బోల్తాపడింది. శనివారం రోజు ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా అలజడి రేపింది. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఘాట్ రోడ్ వెంబడి కిందకు దిగుతున్న సమయంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో 11 మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్పందించిన స్థానికులు, వ్యాపారస్తులు, ఇతర భక్తులు అంబులెన్స్ ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి గాయపడినవారిని తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. ఆటోలోని ప్రయాణికులు మంచిర్యాల జిల్లా మ్యాదరిపేట, లక్షేట్ పేట వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఘాట్ రోడ్డులో సేఫ్టీ చర్యలు తీసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com