Heavy Rains in Telugu States : రేపు అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Heavy Rains in Telugu States : రేపు అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. ఈ నెల 24వ తేదీకి అంది వాయుగుండంగా మారి.. ఆ తర్వాత తుఫానుగా బలపడే అవకాశం ఉంది. అనంతరం ఒడిశా, ప.బెంగాల్ తీరాల వైపు పయనిస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఏపీకి తుఫాను ముప్పు లేదని భావిస్తున్నారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందన్నారు. అటు ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో 3, 4 రోజులు వర్షాలు కురవనున్నాయి. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశముందని వివరించింది. అలాగే ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.

కాగా, సోమవారం సాయంత్రం హైదరాబాద్‌, వికారాబాద్‌ జిల్లాతో పాటు అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్‌ జిల్లా బేలలో అత్యధికంగా 42.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వర్షానికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వికారాబాద్‌ జిల్లాలో పలుచోట్ల చెట్లు విరిగిపడగా, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. అకాల వర్షాలతో మర్పల్లి మండలంలోని ఉల్లి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాలకు పొలాల దగ్గర నిల్వ చేసిన ఉల్లి పంట కుళ్లిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags

Next Story