TG : సొంత అడ్డాల్లో సీఎం రేవంత్‌కు షాక్

TG : సొంత అడ్డాల్లో సీఎం రేవంత్‌కు షాక్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి లోక్ సభతో పాటు తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో ఓటమి చవి చూడడం ఆయన్ను ఇబ్బందులకు గురిచేస్తోంది. లోక్సభ సీట్లు పెరిగాయన్న ఆనందం ఒక వైపు ఉండగా, మరోవైపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహబూబ్ నగర్, మల్కాజిగిరి నియోజక వర్గాలలో పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం ఆయనకు షాకిస్తున్నాయి.

నాగర్ కర్నూలులో మల్లు రవి గెలవడం రేవంత్ కు కాస్త రిలీఫ్. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకు గానూ 8 స్థానాలలో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కేవలం మల్కాజిగిరి, నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ నుంచి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ఏకంగా 8 స్థానాల్లో విజయం సాధించారు.

పాలమూరు ఆయన సొంత జిల్లా కాగా, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. ఇక్కడ చల్లా వంశీచంద్ రెడ్డి ఓడిపోయారు. తన రాజకీయ ప్రత్యర్థి డీకే అరుణ గెలిచారు. మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలోని 7 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నా ఆ ఎంపీ సీటు గెలవకపోవడం రేవంత్ కు ఇబ్బందే. మరోవైపు.. అటు నల్గొండలో ఉత్తమ్, భువనగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ అభ్యర్థులను రికార్డ్ మెజారిటీలతో గెలిపించుకోవడం రేవంత్ కు మరోరకమైన ప్రతిష్టకు సంబంధించిన ఇబ్బంది తెచ్చిపెడుతోంది.

Tags

Next Story