Voters : ఓటు కోసం సొంత రాష్ట్రానికి పోటెత్తారు

Voters : ఓటు కోసం సొంత రాష్ట్రానికి పోటెత్తారు

ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తెలంగాణలోని ఏపీ వాసులు సొంత రాష్ట్రానికి పోటెత్తుతున్నారు. మూడు రోజులు వరుస సెలవులు రావడంతో తెలంగాణ నుంచి ఏపీకి బయల్దేరారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవే రద్దీగా మారింది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఏపీలో ఓటు ఉండి తెలంగాణలో నివసిస్తున్న వారు 30 లక్షల వరకు ఉంటారని అంచనా. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 18 లక్షల మంది ఉన్నట్లు సమాచారం.

ఏపీలో అసెంబ్లీతోపాటు ఎంపీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో హైదరాబాద్‌లోని పలు పార్టీల ఎంపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్ స్థానాల్లో సెటిలర్ల ఓట్లు లక్షల్లో ఉన్నాయి. వీరంతా ఓటేయడానికి ఏపీకి పయనమవుతున్నారు. కానీ ఇక్కడే ఓటేయాలంటూ తెలంగాణ నేతలు ప్రాధేయపడుతున్నారు. ఒక్కో ఓటుకు రూ.5వేల వరకు ఇస్తున్నట్లు టాక్. డబ్బుతోపాటు బహుమతులు కూడా ఇస్తున్నట్లు సమాచారం.

నేటితో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మైక్‌లు మూగబోనున్నాయి. మరో 48 గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 57 రోజులుగా ఎన్నికల ప్రచారం కొనసాగింది. కాగా బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక, ఖర్గే తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు.

Tags

Next Story