Donald Trump : ట్రంప్‌కు టారిఫ్ షాక్.. 10% సుంకం నిబంధన చట్టవిరుద్ధమని అమెరికా కోర్టు సంచలన తీర్పు.

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సొంత దేశంలోనే ఊహించని చుక్కెదురైంది. విదేశీ దిగుమతులపై ఆయన విధించిన 10 శాతం టారిఫ్ (సుంకం) నిబంధనను అక్కడి ట్రేడ్ కోర్ట్ తప్పుపట్టింది. ఇది చట్టవిరుద్ధమని, అధ్యక్షుడి అధికారాల పరిధిని దాటి తీసుకున్న నిర్ణయమని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ట్రంప్ హయాంలో తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యంపై పెద్ద ఎత్తున ప్రభావం చూపగా, కోర్టు మొట్టికాయలు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ట్రేడ్ కోర్ట్ తీర్పు వెనుక అసలు కథ
అమెరికా కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌లోని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ 2-1 మెజారిటీతో ట్రంప్ విధించిన 10 శాతం టారిఫ్‌ను ఇన్ వాల్యూడ్ అని ప్రకటించింది. గతంలో సుప్రీంకోర్టు కూడా ట్రంప్ టారిఫ్ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమని చెప్పినప్పటికీ, ట్రంప్ సర్కార్ 1974 ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 122ను ఉపయోగించి తాత్కాలికంగా 10 శాతం గ్లోబల్ టారిఫ్‌ను ఫిబ్రవరిలో అమలులోకి తెచ్చింది. అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడికి ఇచ్చిన అధికారాలను ట్రంప్ దుర్వినియోగం చేశారని కోర్టు ఇప్పుడు కుండబద్ధలు కొట్టింది.
ఎవరికి ఊరట లభించింది?
ప్రస్తుతానికి ఈ తీర్పు కేవలం వాషింగ్టన్ రాష్ట్రంతో పాటు బర్లాప్ అండ్ బ్యారెల్ (మసాలా దినుసుల కంపెనీ), బేసిక్ ఫన్ (బొమ్మల తయారీ సంస్థ) అనే రెండు ప్రైవేట్ కంపెనీలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మూడు సంస్థల నుంచి టారిఫ్ వసూలు చేయకూడదని కోర్టు ఆదేశించింది. బేసిక్ ఫన్ సీఈఓ జే ఫోర్‌మాన్ మాట్లాడుతూ.. తాము ఇప్పటికే టారిఫ్ రూపంలో లక్ష డాలర్లకు పైగా చెల్లించామని, తమ లాంటి చిన్న వ్యాపారస్తులకు ఈ విజయం గొప్ప ఊరటనిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. అయితే, మిగిలిన 24 మంది దిగుమతిదారులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు ప్రస్తుతానికి పక్కన పెట్టింది.
సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఏంటి?
నిజానికి ఈ గొడవ ఇప్పుడిదే కాదు. గత ఏడాది దాదాపు అన్ని దేశాలపై ట్రంప్ సర్కార్ భారీ టారిఫ్ రేట్లను విధించింది. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరగగా, 6-3 మెజారిటీతో కోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టివేసింది. 1970ల నాటి ఎమర్జెన్సీ చట్టాన్ని అడ్డుపెట్టుకుని 100కు పైగా దేశాలపై సుంకాలు విధించడం, ఆ దేశాలను ట్రేడ్ డీల్స్ కోసం బ్లాక్ మెయిల్ చేయడం అధ్యక్షుడి అధికారాల పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు అప్పట్లోనే స్పష్టం చేసింది. ఆ చట్టంలో అసలు టారిఫ్ అనే పదమే లేదని కోర్టు ఎత్తిచూపడం గమనార్హం.
ముందు ముందు ఏం జరగబోతోంది?
ప్రస్తుతం ట్రేడ్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై ట్రంప్ యంత్రాంగం, అమెరికా న్యాయశాఖ ఎలా స్పందిస్తుందనే దానిపై అందరి దృష్టి నెలకొంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేస్తారా లేక జూలై 24తో ముగియనున్న ఈ తాత్కాలిక టారిఫ్‌లను ఇప్పుడే వెనక్కి తీసుకుంటారా అనేది వేచి చూడాలి. ఒకవేళ ప్రభుత్వం అప్పీల్ చేయకపోతే, ఇది ఇతర దిగుమతిదారులకు కూడా ఒక ఆయుధంగా మారుతుంది. దీనివల్ల ట్రంప్ ఆశించిన ఆదాయానికి గండి పడటమే కాకుండా, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల్లో మరోసారి అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
