AP: కొనసాగుతున్న అంగన్‌వాడీల ఆందోళన

AP: కొనసాగుతున్న అంగన్‌వాడీల ఆందోళన
వెనక్కి తగ్గేదే లేదంటూ ఆందోళనల హోరు... జగన్‌ అహంకారపూరిత వైఖరిపై చంద్రబాబు ఆగ్రహం

వేతనాల పెంపు సహా సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు పన్నెండో రోజూ ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తగ్గేదే లేదంటూ వినూత్న నిరసనలతో హోరెత్తించారు. తమ పోరాటాన్ని వైసీపీ సర్కార్‌ అణచివేసేందుకు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఆటంకాలు ఎదురైనా... డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.


కృష్ణా జిల్లా గన్నవరంలో I.C.D.S కార్యాలయం ఎదుట నోటిలో ఆకులు పెట్టుకుని ఆందోళన తెలిపారు. విజయవాడలో అంగన్వాడీలు మానవహారంగా ఏర్పడి నిరసన చేశారు. NTR జిల్లా నందిగామలో RDO కార్యాలయం ఎదుట గరిటలతో కంచాలను కొడుతూ..నిరసన తెలిపారు. సీఎం జగన్ కు తమ సమస్యలు కనిపించడంలేదని కర్నూలులో అంగన్వాడీలు కళ్లకు గంతలు కట్టుకున్నారు. నంద్యాలలో తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై ఒంటి కాలిపై నిలబడి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి తమ ఆందోళన వినిపించడం లేదంటూ అనంతపురం జిల్లా గుత్తిలో చెవులు మూసుకుని నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో... ICDS ప్రాజెక్టు కార్యాలయం ఎదుటరెండు చేతులు పైకెత్తి దణ్ణం పెడుతూ ఆందోళన చేశారు. విశాఖలో చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. విజయనగరంలో అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించాలంటూ. ముఖ్యమంత్రి జగన్ కి పోస్టు కార్డులు రాశారు.


పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ 11 రోజుల నుంచి అంగన్ వాడీలు ఆందోళన చేస్తుంటే పట్టించుకోకపోవడం జగన్ ప్రభుత్వ అహంకార దోరణికి నిదర్శనమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సేవకు ప్రతి రూపంగా ఉన్న అంగన్ వాడీల సమస్యల పరిష్కరించడం మాని వారి నిరసనలను అణిచివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆనాడు అంగన్ వాడీల కష్టాన్ని, సేవను తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించి 2014 నాటికి 4వేల 200 రూపాయలు ఉన్నవేతనాన్ని 10వేల 500 రూపాయలకు పెంచామని చంద్రబాబు గుర్తు చేసారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా సంక్షేమ పథకాలు అందించామన్నారు.వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీలకు కష్టాలు మొదలైనట్టు చెప్పిన చంద్రబాబు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వారి జీతాలు పెంచలేదన్నారు. అర్థం లేని ఆంక్షలు పెట్టి వారి సంక్షేమ పథకాలకు కోతలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారు. న్యాయబద్దమైన డిమాండ్లు చేస్తున్న అంగన్ వాడీలను చర్చలకు పిలిచి మాట్లాడకపోవడం నిరంకుశత్వమని దుయ్యబట్టారు.

Tags

Read MoreRead Less
Next Story