AP: అంగన్‌వాడీల ఆందోళనలపై ఉక్కుపాదం

AP: అంగన్‌వాడీల ఆందోళనలపై ఉక్కుపాదం
40వ రోజు కొనసాగిన నిరసనల హోరు.... రాస్తారోకోలను అడ్డుకున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌లో హామీలు అమలు కోరుతూ అంగన్వాడీలు 40వ రోజు కదం తొక్కారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ ఎక్కడికక్కడ రాస్తారోకోలు చేపట్టగా పోలీసుల అడ్డగింపులతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు ఈడ్చేశారు. పోలీసులు, ప్రభుత్వ తీరుపై మండిపడిన అంగన్వాడీలు కనీస వేతనం, గ్రాట్యుటీ అమలు చేసేంత వరకు ఉద్యమం విరమించేది లేదని తేల్చి చెప్పారు. నెల్లూరులో అంగన్వాడీలు చేపట్టిన రాస్తారోకో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సీఐటీయూ ఆధ్వర్యంలోఅంగన్వాడీలు భారీ ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. అంగన్వాడీలను, సీఐటీయూ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో ఇరువురి మధ్య తోపులాటలు జరిగాయి. ఈ ఘర్షణలో అంగన్వాడీ కార్యకర్తలు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం బాధితులను ఆస్పత్రికి తరలించారు. పోలీసుల తీరుపై అంగన్వాడీలు మండిపడ్డారు.


విజయవాడలో అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల నేతలు ఆందోళన పాల్గొన్నారు. లెనిన్ సెంటర్ లో రాస్తారోకోకు సిద్ధంకాగా.. అనుమతి లేదంటూ నాయకులను బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారు. NTR జిల్లా నందిగామలో జాతీయ రహదారిపై అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు రాస్తారోకో చేశారు. కనీస వేతనం 26వేలు ఇవ్వాలంటూ మైలవరంలో నినదించారు. కృష్ణా జిల్లా గుడివాడలో CITU నేతలు రహదారిపై బైఠాయించగా. పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. కంకిపాడులో ధర్నా చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రహదారిపై మానవహారం చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద అంగన్వాడీలకు మద్దతుగా ప్రజా సంఘాలు రాస్తారోకో నిర్వహించగా... బస్సుల రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళనకారులను అదుపులో తీసుకున్నారు. కనిగిరిలో అంగన్వాడీలకు మద్దతుగా ప్రజా సంఘాలు, ఆటో సంఘాల నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఎమ్మిగనూరులో భారీ ర్యాలీ నిర్వహించారు


విజయనగరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. 40రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అనంతపురంలో అంగన్వాడీలకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న CITU నాయకులను అరెస్టు చేశారు. రాయదుర్గంలో వినాయక సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. విజయనగరంలో అంగన్వాడీలకు మద్దతుగా.... సీఐటీయూ, ఏఐటీయూసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. శ్రీకాకుళంలో ఆందోళన చేస్తున్న... అంగన్వాడీలు, కార్మిక సంఘాల నాయకులను.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న CITU నాయకులను... పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేయగా పోలీస్ వాహనాన్ని అంగన్వాడీలు అడ్డగించారు.

Tags

Read MoreRead Less
Next Story