AP: ఎనిమిదో రోజూ అంగన్‌వాడీల ఆందోళన

AP: ఎనిమిదో రోజూ అంగన్‌వాడీల ఆందోళన
వెనక్కి తగ్గేదే లే అని స్పష్టీకరణ... వైసీపీ అణచివేత ధోరణిపై ఆగ్రహం...

ఆంధ్రప్రదేశ్‌లో సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు ఎనిమిదో రోజూ రోడ్డెక్కారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తగ్గేదే లేదంటూ ర్యాలీలు, నిరసనలతో హోరెత్తించారు. తమ పోరాటాన్ని వైసీపీ సర్కార్‌ అణచివేసేందుకు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఆటంకాలు ఎదురైనా డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న నిరసనలు ఎనిమిదో రోజూ కొనసాగాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చెవిలో పువ్వులు, కాలీ ఫ్లవర్లు పెట్టుకుని . పూనకం వచ్చినట్లు ఊగుతూ వినూత్న నిరసన తెలిపారు. గన్నవరం ICDS కార్యాలయం ఎదుట పాటలు పాడుతూ, డాన్సులు వేస్తూ నిరసన తెలిపారు. N.T.R. జిల్లా మైలవరం M.P.D.O. కార్యాలయం వద్ద అంగన్వాడీలు వంటావార్పు నిర్వహించారు. విజయవాడ ధర్నాచౌక్‌ వద్దకు భారీగా చేరుకున్న అంగన్వాడీలు.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట, మార్కాపురంలో అంగన్వాడీలు వంటావార్పు కార్యక్రమంతో నిరసన తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి తహసీల్దార్‌ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ చేశారు. నాలుగు రోడ్ల కూడలిలోని దుకాణాల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. బద్వేల్ CDPO కార్యాలయం నుంచి NGO కాలనీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా నిలబడి... నిరసన తెలిపారు. కడపలోని ICS కార్యాలయం ఎదుట ఒంటి కాలిపై నిలబడి... దణ్ణం పెడుతూ నిరసన తెలిపారు.


నంద్యాల జిల్లా డోన్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట... ఒంటికాలిపై నిలబడి... నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తిలో అంగన్వాడీలు పచ్చగడ్డి తింటున్నట్లు నోటిలో పెట్టుకుని... మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అంగన్వాడీలు రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లో భిక్షాటన చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం ICDS కార్యాలయం వద్ద అంగన్వాడీలు డాన్సులు వేస్తూ నిరసన తెలిపారు. శ్రీకాకుళంలో వంటావార్పు చేపట్టారు. ఈ ఆందోళనకు తెలుగుదేశం మాజీ MLA గుండ లక్ష్మీదేవి మద్దతు తెలిపారు.

ప్రభుత్వం కళ్లు తెరిచి సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,అప్పటివరకు సమ్మె విరమించేది లేదన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ICDS కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ధర్నా చేశారు. MPDO కార్యాలయం వద్ద. వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story