AP: ప్రవాసాంధ్రుడు ।యష్‌ అరెస్ట్‌ దుమారం

AP: ప్రవాసాంధ్రుడు ।యష్‌  అరెస్ట్‌ దుమారం
అమెరికా నుంచి వచ్చిన యష్‌ను అరెస్ట్‌ చేసిన ఏపీ సీఐడీ... ఇదేం పనంటూ మండిపడ్డ చంద్రబాబు

సామాజిక మాధ్యమాల్లో యష్‌గా సుపరిచితుడైన ప్రవాసాంధ్రుడు యశస్వి బొద్దులూరిని C.I.D. అదుపులోకి తీసుకోవడం దుమారం రేపింది. అమెరికా నుంచి వచ్చిన ఆయన్ను లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ ఉందంటూ శంషాబాద్‌ విమానాశ్రయంలో సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని... గుంటూరు ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అరెస్టు చూపించి వచ్చే జనవరి 11న తిరుపతిలో విచారణకు రావాలంటూ 41A నోటీసులిచ్చి విడిచిపెట్టారు. యష్‌ అరెస్ట్‌ను తెలుగుదేశం తీవ్రంగా ఖండించింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యశశ్వి ఉద్యోగరీత్యా అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.


సోషల్ మీడియా వేదికగా జగన్‌ సర్కార్‌ విధానాలను యష్‌ ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే తెనాలిలో ఉంటున్న తల్లికి ఆరోగ్యం బాగాలేదని తెలిసి చూసేందుకు అమెరికా నుంచి వచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగిన ఆయన్నిలుక్‌అవుట్‌ సర్క్యులర్‌ ఉందంటూ ఇమిగ్రేషన్‌ సిబ్బంది ఆపేశారు. తెల్లవారుజామున సీఐడీ పోలీసులకు అప్పగించారు. అక్కడి నుంచి యష్‌ని... మంగళగిరి, తర్వాత గుంటూరు CID ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న తెలుగుదేశం నేతలు... పోలీసుల వైఖరిని ఖండించారు. యష్‌ అరెస్టు చూపించిన పోలీసులు 2024 జనవరి 11న తిరుపతి CID ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు రావాలంటూ 41A నోటీసులిచ్చి వదిలేశారు.


తల్లి ఆరోగ్యం బాగాలేదని ఆమెను చూడాలని చెప్పినా పోలీసులు వినలేదని... విడుదల తర్వాత యష్‌ ఆవేదన వ్యక్తంచేశారు. యష్‌ అరెస్టును తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖండించారు. వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు, నోటీసులు, వేధింపులకే సమయం వెచ్చిస్తోందన్న ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని పోలీసులను ప్రత్యేకంగా పక్క రాష్ట్రానికి పంపి అరెస్టు చేశారని విమర్శించారు. ఉగ్రవాదిని హింసించినట్లు యష్‌ పట్ల C.I.D వ్యవహరించటం దుర్మార్గమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ధ్వజమెత్తారు. ఈ చర్యల ద్వారా.. జగన్ ప్రభుత్వ ప్రాధామ్యాలు ప్రజలకు స్పష్టంగా అర్థముతున్నాయని అన్నారు. యష్ పట్ల CID తీరుతో ప్రశ్నించే గొంతులను నిర్బంధాలు, అక్రమ అరెస్టులతో అణచి వేయాలన్న వైకాపా వైఖరి ప్రస్భుటమైందని.... తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.

వైసీపీకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. యష్‌ను అదుపులోకి తీసుకోవడం సైకోయిజానికి నిదర్శనమని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. జగన్‌ నియంతృత్వ పోకడలకు మూల్యం చెల్లించక తప్పదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజా హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story