YCP: సిద్ధం సభలకు బస్సుల్లోనే డబ్బు, మద్యం పంపిణీ

YCP: సిద్ధం సభలకు బస్సుల్లోనే డబ్బు, మద్యం పంపిణీ
తిరుమల భక్తులకు తప్పని తిప్పలు...లబోదిబోమన్న ప్రయాణికులు... పోలీసుల ఎదుటే మద్యం తాగి చిందేసిన వైసీపీ నేతలు

జగన్‌ సిద్ధం సభలతో ప్రజలకు అగచాట్లు తప్పడం లేదు. రాప్తాడు సభ కోసం RTC 3వేలకు పైగా బస్సులను కేటాయించింది. రాయలసీమతో పాటు ఒంగోలు, గుంటూరు ప్రాంతాల నుంచి కూడా బస్సుల్ని తరలించడంతో బస్సుల్లేక ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు. చిన్నారులు, వృద్ధులతో గంటలకొద్దీ నిరీక్షించినా... బస్సుల జాడ లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. తిరుమల శ్రీవారి భక్తులకు సైతం అవస్థలు తప్పలేదు. మరోవైపు సీఎం సభకు వచ్చిన వారికి బస్సుల్లోనే డబ్బు, మద్యం పంపిణీ చేశారు. సభా ప్రాంగణంలోనే పోలీసుల ఎదుటే మందుబాబులు మద్యం సేవించి చిందులేశారు.


ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలతో ప్రజలకు నరకయాతన తప్పడం లేదు. రాప్తాడు సభ కోసం RTC 3వేలకు పైగా బస్సులను కేటాయించడంతో బస్టాండ్‌లు బోసిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతపురం బస్టాండ్‌లో ఉదయం నుంచి ప్రయాణికులు గంటల తరబడి వేచిచూసి... ఎప్పటికీ రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చేసేదిలేక ఆటోల్లో గమ్యస్థానాలకు వెళ్లారు. కదిరిలో ప్రయాణికులు గంటలపాటు బస్సుల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. చంటి పిల్లలు, వృద్ధులు బాగా ఇబ్బందిపడ్డారు. 110 బస్సులున్న కదిరి డిపోలో 72 బస్సులను సీఎం సభకు తరలించారు. ఫలితంగా తగినన్ని బస్సులు లేక వందల మంది ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు..


సత్యసాయి జిల్లా మడకశిరలోనూ బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటోల్లో గమ్యస్థానాలకు వెళ్లారు. రద్దీతో కర్ణాటక బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సత్యసాయి జిల్లా మామిళ్ళపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై భారీ వాహనాలను దారి మళ్లించారు. ఫలితంగా హైదరాబాద్‌ వెపు వెళ్లే వాహనాలకు 100 కిలోమీటర్ల దూరం పెరిగింది. ట్రాఫిక్‌ జామ్‌తో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. కర్నూలు బస్టాండ్‌లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గంటల తరబడి వేచిచూసి చివరికి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. నంద్యాల, ఆదోనిలోనూ ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. బస్టాండ్లు, రోడ్లపై గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. ప్రభుత్వ తీరుతో విసుగెత్తిన ప్రజలు... ముఖ్యమంత్రి జగన్‌, వైకాపా నేతలపై మండిపడ్డారు..


కడపలో కొత్త బస్టాండ్‌, పాత బస్టాండ్‌ మొత్తం నిర్మానుష్యంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 280 బస్సులను సభకు తరలించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రొద్దుటూరులో ప్రైవేటు విద్యాసంస్థలపై ఒత్తిడి తెచ్చి బ‌స్సులను తీసుకుని భారీగా జ‌నాన్ని త‌ర‌లించారు. తిరుపతి జిల్లాలో 374బస్సులు తరలించడంతో తిరుపతి బస్‌స్టేషన్‌లో భక్తులు, ప్రయాణికులు గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. అరకొర బస్సుల కోసం ప్రయాణికులు ఎగబడడంతో తోపులాట చోటుచేసుకుంది. తిరుపతి నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని వెల్లూరు, తిరువణ్ణామలై, కంచి, బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. కనీసం సమాధానం చెప్పేవారు కూడా లేరంటూ ప్రయాణికులు మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story