AP: ఉద్ధృతంగా మున్సిపల్‌ ఉద్యోగుల సమ్మె

AP: ఉద్ధృతంగా మున్సిపల్‌ ఉద్యోగుల సమ్మె
జగన్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని సర్వమత ప్రార్థనలు.... పొర్లు దండాలు పెడుతూ నిరసనలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనలను..మరింత ఉద్ధృతం చేశారు. డిమాండ్లు నెరవేర్చే వరకూ.. సమ్మె విరమించే ప్రసక్తే లేదని..... తేల్చి చెప్పారు. సీఎం జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని అనంతపురంలో సర్వ మత ప్రార్థనలు.... నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె పదమూడో రోజుకు చేరుకుంది. విజయవాడ ధర్నా చౌక్ లో నిర్వహించిన ధర్నాలో సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచడానికి డబ్బులు లేవంటూ చెబుతున్న ప్రభుత్వం.... ముఖ్యమంత్రి జగన్ కోసం విశాఖపట్నంలో విలాసవంతమైన క్యాంపు కార్యాలయం నిర్మించుకోవడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని రాఘవులు ప్రశ్నించారు. ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్ కార్మికులు చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని ఎలా పోషిస్తారని మండిపడ్డారు. మున్సిపల్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. మున్సిపల్ రంగంలో పని చేస్తున్న కార్మికులందరికీ హెల్త్, రిస్కు అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నందు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నిరవధిక సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులకు అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సంఘీభావం తెలిపారు. కార్మికులను, అంగన్వాడీ కార్యకర్తలను అణగదొక్కే ధోరణితో కొత్త జీవోలు తీసుకురావడం సరికాదని అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం పక్కనపెట్టి మెరుగైన సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికుల పట్ల వివక్ష చూపటం సరికాదని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మున్సిపల్ కార్మికులకు న్యాయం చేస్తామని రవికుమార్ హామీ ఇచ్చారు.


కనీస వేతనం అమలు చేయాలని కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం ఎదుట....... పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. ప్రకాశంజిల్లా కనిగిరిలో చెత్తను తరలిస్తున్న వాహనాలను అడ్డుకుని కార్మికులు నిరసన తెలిపారు. చెత్త వాహనానికి అడ్డుగా పడుకొని... కనీస వేతనం అమలు చేయాలని నినాదాలు చేశారు. 13 రోజులుగా సమ్మె చేస్తుంటే.. సమస్యలు పరిష్కరించకుండా చెత్తను ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఒంగోలు మున్సిపల్ కార్యాలయం ఎదుట.... కార్మికులు ధర్నా నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. శరీరానికి వేప మండలు చుట్టుకొని... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతపురంలో 13వ రోజు మున్సిపల్ కార్మికుల వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ముస్లిం, హిందూ, క్రిస్టియన్ ప్రార్థనలు చేస్తూ నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికుల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో 13వ రోజు సర్వమత పూజలు చేస్తూ నిరవధిక సమ్మె చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story