AP HighCourt: ప్రభుత్వ ప్రకటనలపై హైకోర్టులో పిల్

AP HighCourt: ప్రభుత్వ ప్రకటనలపై హైకోర్టులో పిల్
సీఎం జగన్‌కు నోటీసులు

వైకాపా రాజకీయ ప్రయోజనాలను ప్రోత్సహించేలా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుచేసి రాష్ట్రప్రభుత్వం వివిధ మార్గాల్లో ప్రకటనలు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఇకమీదట జారీచేస్తే ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాల్సిందేనంటూ రాష్ట్రప్రభుత్వాకి తేల్చిచెప్పింది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీచేసింది. సీఎస్‌, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శితో సంబంధిత అధికారులకు నోటీసులు జారీచేసింది.

వైకాపా రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లలో ప్రజాధనాన్ని వెచ్చించి రాష్ట్రప్రభుత్వం జూన్‌ 2019 నుంచి భారీస్థాయిలో అడ్వొర్టైజ్‌మెంట్లకు ఖర్చు చేసిందని, ఇలాంటి చర్య సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం అంటూ బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వం ఖర్చుచేసిన సొమ్మును వైకాపా నుంచి రాబట్టాలని కోరారు. ప్రజాధనం దుర్వినియోగం, ప్రకటనల జారీ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. జగతి పబ్లికేషన్స్‌కు ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని అభ్యర్థించారు.

పిటిషనర్‌ తరఫున న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపించారు. ప్రభుత్వ అడ్వొర్టైజ్‌మెంట్ల ద్వారా ప్రతిపక్షాలను విమర్శించడానికి వీల్లేదన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిసూ రాష్ట్రప్రభుత్వం కోట్లలో ప్రజల సొమ్ము ఖర్చుచేసి వైకాపా ప్రయోజనాలను ప్రోత్సహించేలా ప్రకటనలు ఇచ్చిందన్నారు. రాజకీయ పార్టీల విషయంలో ప్రభుత్వం తటస్థంగా ఉండాలని సుప్రీం చెప్పిందన్నారు. రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ప్రకటనలు వైకాపాను ప్రోత్సహించేవిగా, గత ప్రభుత్వాన్ని కించపరిచేవిగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠను కాకుండా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్ఠను పెంచేవిగా ప్రకటనలు ఉన్నాయన్నారు. వివిధ పత్రికల్లో వచ్చిన ప్రభుత్వ ప్రకటనలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్‌ వాదనలు వినిపించారు. పిల్‌ దాఖలు చేయడం వెనుక దురుద్దేశం ఉందన్నారు. 2019 తర్వాత ఇచ్చిన ప్రకటనల గురించి మాత్రమే పిటిషనర్‌ ప్రస్తావించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రకటనలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. వివరాలు సమర్పించేందుకు సమయం కావాలన్నారు. దీంతో ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ విచారణను మార్చి 6కి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story