AP: ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం

AP: ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం
చంద్రబాబుతో ప్రశాంత్‌కిషోర్‌ భేటీ... కీలకం అంశాలపై సుదీర్ఘ చర్చ

అసెంబ్లీ ఎన్నికలకు సమీపిస్తున్నవేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలుగదేశం అధినేత చంద్రబాబును కలిశారు. ఈ భేటీలో.. ఏపీ రాజకీయంపై మూడు గంటలపాటు చర్చించగా వైసీపీపై యువత అసంతృప్తితో ఉన్నారని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు తెలిసింది. దళితులు, బీసీ వర్గాలు వైకాపాకు దూరం అయ్యాయని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రభుత్వానికి అహంకారం అనే భావన ప్రజల్లో బలంగా ఉందని, అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించుకోవాలని ప్రశాంత్ కిషోర్ సూచించినట్టు తెలిసింది.


2019 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా పనిచేసిన ఐ-ప్యాక్‌ అధినేత ప్రశాంత్‌ కిషోర్‌ తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలవడం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. హైదరాబాద్‌ నుంచి ఒకే విమానంలో గన్నవరం చేరుకున్న ప్రశాంత్ కిషోర్, లోకేష్‌ ఒకే కారులో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ చంద్రబాబుతో సమావేశం అయ్యారు. షోటైమ్ కన్సల్టెన్సీ పేరుతో తెలుగుదేశానికి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న రాబిన్‌శర్మ కూడా... భేటీలో పాల్గొన్నారు. దాదాపు మూడు గంటలు సాగిన భేటీలో ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించినట్టు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వ పాలనపై ప్రశాంత్‌ కిషోర్‌ లోతైన నివేదికను చంద్రబాబు ముందు ఉంచినట్లు తెలుస్తోంది.

వైసీపీ ప్రభుత్వ విధానాలపై యువత తీవ్ర అసంతృప్తితో, ఆవేదనతో ఉన్నారని పీకే వ్యాఖ్యానించారు. దళితులు, బీసీలపై దాష్టీకాలు ఆయా వర్గాలను వైకాపాకు దూరం చేశాయని. ప్రస్తావించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, కరెంట్ బిల్లులు, పన్నుల బాదుడు అంశాలు వచ్చే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పీకే అభిప్రాయపడినట్టు తెలిసింది. ఒకరిద్దరు మినహా మంత్రులందరికీ సున్నా మార్కులని, వైసీపీ ప్రభుత్వానికి అహంకారమనే భావన ప్రజల్లో వ్యక్తం అవుతోందని చంద్రబాబుకు చెప్పిన పీకే అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.

వైసీపీ సర్కార్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న యువతను ఆకర్షించే దిశలో తెలుగుదేశం కార్యాచరణ ఉండాలని పీకే సూచించినట్టు తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు అరెస్టుతో తటస్థంగా ఉండేవాళ్లేగాక కొంతమేర వైసీపీ వర్గాల్లో కూడా జగన్‌పై వ్యతిరేకత వచ్చిందన్న పీకే ప్రస్తావించినట్టు సమాచారం. మిగిలిన వర్గాలు, అంశాల వారీగా వైసీపీ బలాబలాలను పీకే వివరించినట్టు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత ప్రశాంత్‌ కిషోర్‌, లోకేష్‌ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లారు.

Tags

Read MoreRead Less
Next Story