PROTEST: వైసీపీ దాడులపై కదం తొక్కిన ఆందోళనలు

PROTEST: వైసీపీ దాడులపై కదం తొక్కిన ఆందోళనలు
పత్రికా సంస్థలపై వైసీపీ దాడులను ఖండించిన ప్రజాసంఘాలు, విపక్షాలు... కేంద్రం, గవర్నర్‍ జోక్యం చేసుకోవాలని డిమాండ్‌

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న పత్రికా సంస్థలపై వైసీపీ నాయకులు దాడులు చేయడం దారుణమని ప్రజాసంఘాలు, విపక్ష నాయకులు ధ్వజమెత్తారు. ఏపీలో పాత్రికేయులపై దాడులను ఖండిస్తూ తిరుపతిలో తెలుగుదేశం, AITUC నాయకులు నిరసన చేపట్టారు. గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం నాయకులు...., అంబేడ్కర్‍ విగ్రహం వద్ద AITUC నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా..... నినాదాలు చేశారు. అనంతపురం, కర్నూలులో మీడియాపై జరిగిన దాడిని తెలుగుదేశం నేత సుగుణమ్మ ఖండించారు. కేంద్రం, గవర్నర్‍ జోక్యం చేసుకుని దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు కొనసాగించాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే దాడులు చేయించడం సిగ్గుచేటని నేతలు ధ్వజమెత్తారు. శ్రేణులను రెచ్చగొట్టేలా ముఖ్యమంత్రే ప్రసంగాలు చేయడం దారుణమన్నారు. కేంద్రం జోక్యం చేసుకోని జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మీడియాపై వైసీపీ దాడులని ఖండిస్తూ A.P.U.W.J ఆధ్వర్యంలో జర్నలిస్టులు 'చలో అనంతపురం' చేపట్టారు. సంగమేశ్వర్ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సొంత మీడియా మినహా ఇతర జర్నలిస్టులు, పత్రికలపై దాడులు చేయించడమే సీఎం జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. పోలీసుల నిర్లక్య ధోరణి వల్లే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. వరుస దాడులపై సీఎం జగన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈనాడు కార్యాలయంపై దాడి జరిగి మూడు రోజులవుతున్నా... నిందితులను గుర్తించి కేసులు నమోదు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన వెనుక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఉన్నారనే విషయం పోలీసరులకు తెలియదా అని ప్రశ్నించారు. ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండిస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట సీపీఐ నేతలు ఆందోళన చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


మీడియాపై దాడులు హేయమని తిరుపతి తెలుగుదేశం నేతలు అన్నారు. దాడులను వ్యతిరేకిస్తూ గాంధీ విగ్రహం, అంబేడ్కర్‍ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ అల్లూరి జిల్లా పాడేరు అంబేడ్కర్ సెంటర్‌లో గిరిజన నేతలు నిరసన తెలిపారు. పాత్రికేయులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మీడియాపై దాడులను వ్యతిరేకిస్తూ సింహాద్రి అప్పన్న సన్నిధి స్వామివారి తొలిమెట్టు వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. ప్రజా సంఘాలు, వామపక్షాలు మద్దతు తెలిపాయి.

Tags

Read MoreRead Less
Next Story