AP: ఆందోళనలతో అట్టుడుకుతున్న ఆంధ్రప్రదేశ్‌

AP: ఆందోళనలతో అట్టుడుకుతున్న ఆంధ్రప్రదేశ్‌
ఓవైపు లాయర్లు.. మరోవైపు సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగుల నిరసనలు.. జగన్‌ సర్కార్‌ తీరుపై మండిపాటు...

భూ సమస్యలు పరిష్కరించే బాధ్యతలు రెవెన్యూ అధికారులకు అప్పగిస్తూ జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఇది న్యాయవ్యవస్థలోకి కార్యనిర్వాహక వ్యవస్థ పూర్తిగా చొచ్చుకురావడమేనని నినదించారు. కొత్త చట్టంతో ప్రజలు తమ ఆస్తిపై సర్వహక్కులూ కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. తక్షణం ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ ఏపీలో పలుచోట్ల న్యాయవాదులు ఆందోళనకు దిగారు. బెజవాడ బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించిన న్యాయవాదులు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ప్రజల హక్కులను హరించే విధంగా ఉన్న ఈ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆవరణలోనూ న్యాయవాదులు నిరసన తెలిపారు. ప్రభుత్వం నిరంకుశంగా ఈ చట్టాలను తీసుకొచ్చిందని ప్రజలంతా వ్యతిరేకించాలని కోరారు..


గుంటూరులో జిల్లా కోర్టు సముదాయం వద్ద న్యాయవాదులు ఆందోళన చేశారు. న్యాయవ్యవస్థకు సంబంధం లేనివారితో చట్టానికి రూపకల్పన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త భూచట్టం మొత్తం లోపభూయిష్టంగా ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. దేవీచౌక్‌లో మానవహారం ఏర్పాటుచేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోందంటూ పోలీసులు లాయర్లకు సూచించడంతో... ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొత్త చట్టం వల్ల ప్రజలకు జరిగే నష్టాలపై అవగాహన కల్పిస్తామన్న న్యాయవాదులు... ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.


మరోవైపు... వేతన పెంపు సహా సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. పాదయాత్రలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్న ఉద్యోగులు... సమస్యలు పరిష్కరించేవరకు నిరసనలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. విజయవాడ ధర్నాచౌక్‌లో సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగుల ఆందోళనలు మూడోరోజూ కొనసాగాయి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సమగ్ర శిక్ష ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.


సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె కర్నూలులో మూడో రోజుకు చేరింది. మెడికల్, చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట సమగ్రశిక్ష ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకొని ఆందోళనకు దిగారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మానవహారంగా ఏర్పడి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు . సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలంటూ విశాఖలో ఆందోళన చేపట్టారు. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆందోళన చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు రాజకీయ పక్షాలు సంఘీభావం తెలిపాయి.

Tags

Read MoreRead Less
Next Story