CBN: వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తాం

CBN: వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తాం
జగన్‌ ఐదేళ్ల పాలన అంతా చేదే... తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శలు

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడం సహా...నెలకు 10వేల రూపాయల పారితోషికం ఇస్తామని తెలుగుదేశంఅధినేత చంద్రబాబు ప్రకటించారు. ఐదేళ్ల పాలన మొత్తం చేదు, కారంతో జగన్ నింపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత సమాజంలో జగన్ కు స్థానం లేకుండా పోతుందని... కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో..ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలతో కలిసి అధినేత చంద్రబాబు ఈ వేడుకల్లో పాల్గొనగా వేద పండితులు ఆశీర్వచనం అందించారు. పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ నేతృత్వంలో పంచాంగ శ్రవణం జరగ్గా త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు జరుగుతుందని ఆయన వివరించారు. చంద్రబాబుకు అధికారయోగం ఉందన్న పంచాంగకర్త అమరావతి నిర్మాణం చేపడతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ఉగాది సందర్భంగా అంతా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు. వైసీపీ సర్కారు ఏపీని అధోగతిపాలు చేసిందన్న


ఆయన 14 లక్షల కోట్ల అప్పు, లక్షా 50 వేల కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని గుర్తుచేశారు. మరోవైపు వాలంటీర్‌ వ్యవస్థను ఉపయోగించి రాజకీయ లబ్ధి పొందాలని చూశారన్న ఆయన..వృద్ధులను ఎండలో తీసుకొచ్చి వైకాపా శవ రాజకీయాలు చేసిందని విమర్శించారు. వాలంటీర్లను రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తే వాళ్లు ఒప్పుకోలేదన్న చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తే ప్రజలు ఊరుకోరని స్పష్టం చేశారు.


పేదలను మరింత పేదలుగా చేసే విధానాలను వైకాపా అమలు చేస్తోందన్న చంద్రబాబు, తాము అధికారంలోకి వచ్చాక ముస్లింలు సహా ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికీ మేలు చేస్తామని హామీ ఇచ్చారు. మన దశ, దిశ నిర్దేశించుకునే వేడుక.. కొత్త ఉత్సాహం అందించే పండగ ఇది. ఉగాది సందర్భంగా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. ఈ ఏడాదిలో సాధికారత రావాలి. నూతన సంవత్సరంలో ధరలు తగ్గాలి.. సంక్షేమం ఉండాలి. ఉగాది పచ్చడిలో తీపి, వగరు, చేదు.. అన్నీ ఉంటాయి. ఈ ఐదేళ్లలో బకాసురుడిని మించిన పాలన సాగింది. రాష్ట్రంలో కారం, చేదు రుచులే ఉన్నాయి. అశాంతి, అభద్రతాభావం కనిపిస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకూ నీళ్లు ఇవ్వొచ్చు. సహజ వనరులన్నీ వైకాపా దోపిడీ చేసింది. తెలుగు జాతికి మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలని మనమంతా సంకల్పం తీసుకోవాలి. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి.. ఇదే మన సంకల్పం’’ అని చంద్రబాబు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story