AP: ఆంధ్రప్రదేశ్‌లో అక్రమంగా ఓట్ల తొలగింపు

AP: ఆంధ్రప్రదేశ్‌లో అక్రమంగా ఓట్ల తొలగింపు
అధికార వైసీపీ ప్రజా ప్రతినిధుల కుట్రలు... చర్యలు ఎందుకు తీసుకోరంటూ టీడీపీ నేతల ప్రశ్నలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఓటమి భయంతో వైసీపీ నేతలు అక్రమంగా ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే శంకరరావు ఓటమి భయంతోనే తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారని.... తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆరోపించారు. అధికారులు, సిబ్బందిని భయపెట్టి. ఓట్లు తొలగిస్తున్నారని, కోర్టు తీర్పులను కూడా వైసీపీ నేతలు లెక్క చేయడం లేదని మండిపడ్డారు. ఎన్ని అక్రమాలకు పాల్పడినా వచ్చే ఎన్నికల్లో..... తెలుగుదేశం విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులోని తెలుగుదేశం కార్యాలయంలో.. వైకాపా నేతలు ఓట్ల అక్రమాలకు పాల్పడుతున్న ఓ ఆడియో సంభాషణను ఆయన వినిపించారు.


నాలుగున్నరేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు మినహా మరేం చేయని వైసీపీ ప్రజా ప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో మళ్లీ అందలం ఎక్కేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల ఆదరణ కష్టమని భావించి ఏకంగా ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు కుట్రలు పన్నుతున్నారు. విపక్షాల ఓటు హక్కును కాలరాయాలని బహిరంగంగానే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం కానీ, కలెక్టర్లు కానీ స్పందించడం లేదు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఫిర్యాదులనూ బుట్టదాఖలు చేస్తున్నారు. అధికార వైసీపీ పెదకూరపాడు ఎమ్మెల్యే శంకరరావు మాట్లాడినదిగా చెప్తున్న ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ గ్రామస్థాయి నాయకుడితో జరిపిన ఫోన్‌ సంభాషణ. కులాల వారీగా ఓట్ల వివరాలు అడిగి...ప్రతిపక్షాల ఓట్లు తొలగించాలంటూ సాగిన ఈ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


ఫోన్‌ సంభాషణలో ఉన్నది ఎమ్మెల్యే శంకరరావే అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆరోపించారు. ఓటమి భయంతోనే తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున గెలిచి వైసీపీలోకి ఫిరాయించిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌.. పెద్దసంఖ్యలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్రకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా ఒక సామాజికవర్గానికి చెందినవారి ఓట్లు తొలగించేందుకు పెద్ద ఎత్తున ఫారం-7 దరఖాస్తులు చేయించిన ఆయన వాటి పురోగతిని వాట్సప్‌ ద్వారా పర్యవేక్షిస్తూ దొరికిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో అధికారపార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల ఓట్లను వేల సంఖ్యలో తొలగించే కుట్రల్ని రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు పెద్ద స్థాయిలో ఫారం-7 దరఖాస్తులను దాఖలు చేసిన వైసీపీ అప్పటి అధికార పక్షానికి చెందిన వారి ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించి దొరికిపోయింది. అప్పట్లో ఎన్నికల అధికారులు కేసులు నమోదు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ కేసులన్నీ తొక్కిపెట్టేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అంతేలేకుండా చెలరేగిపోతోంది. అయితే అధికార పార్టీ కుట్రకు ఉద్యోగులు, పోలీసులు... బలైపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story