AP : టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి

AP : టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి

వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి (Parthasarathi) టీడీపీలో (TDP) చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పార్థసారథికి పసుపు కండువా కప్పిన లోకేశ్ ఆయనకు మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలికారు. పార్థసారథి వెంట టీడీపీ నేతలు కేశినేని చిన్ని, కొల్లు రవీంద్ర, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, బోడె ప్రసాద్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. వైసీపీ విధానాలతో రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని గ్రహించే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. చంద్రబాబు విజన్‌ భావితరాలకు ఎంతో అవసరమన్నారు.

కాగా ఎన్టీఆర్ జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి పార్థసారథి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పార్థసారథికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది వైసీపీ అధిష్టానం. ఈ స్థానాన్ని మంత్రి జోగి రమేష్‌కు కేటాయించింది. ఈ క్రమంలో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్థసారథికి నూజివీడు టికెట్ ను ఖరారు చేశారు చంద్రబాబు. నూజివీడులో అందరినీ కలుపుకొని పోతూ టీడీపీ జెండా ఎగురవేస్తానని అన్నారు ఎమ్మెల్యే పార్థసారథి. 2004,2009,2019లో ఎమ్మెల్యేగా పెనుమలూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు.

Tags

Read MoreRead Less
Next Story