బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. శుక్రవారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం శ్వాస తీసుకొనేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో కుటుంబ సభ్యులు జైట్లీని ఎయిమ్స్‌కు తరలించారు. గుండె సంబంధమైన విభాగంలో నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు.
అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారంతో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, హర్షవర్దన్, రవిశంకర్ ప్రసాద్, అశ్వని చౌబే, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, లోక్‌తాంత్రిక్ జనతాదళ్ అధినేత శరద్ యాదవ్ తదితరులు ఎయిమ్స్ వెళ్లి.. జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై రాత్రి ఎయిమ్స్ హెల్త్ బులెటెన్ విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించింది. శనివారం మరోసారి ఆయన హెల్త్‌బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది.
గత ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్ బారిన పడినట్టు గతంలో ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో ఆయన అమెరికా వెళ్లి దాదాపు నెల రోజులపాటు చికిత్స తీసుకున్నారు. తిరిగి భారత్‌కు వచ్చి అదే చికిత్సను కొనసాగిస్తున్న జైట్లీ.. కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే ఇంటికే పరిమితమయ్యారు.