అమరావతి విషయంలో అది 200 శాతం నిజం..

Update: 2019-08-23 09:08 GMT

అది ఇల్లు కాదు.. ఐదు కోట్ల ఆశల రాజధాని. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రులకు ఓ రాజధాని ఉండాలని ఆనాటి టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమరావతి మహానగరానికి పునాది రాయి వేసింది. వేల కోట్లతో నిర్మాణాలు సాగుతున్నాయి. సింగపూర్‌, జపాన్‌ కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. అమరావతి ఆంధ్ర ప్రజల్లో కొత్త ఆశలను కల్పించిందనేది 200 శాతం నిజం. ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఆ ప్రభుత్వం ఏం చేయాలి? రాజధానిని ముందుకు తీసుకెళ్లాలి. ప్రజల్లో మరింత భరోసా కల్పించాలి. కానీ అదేమి కనిపించడం లేదు. వైసీపీ మంత్రులు పిల్లి మొగ్గలతో ప్రజలు గందరగోళంలో పడిపోయారు.

ఇవి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు. రాజధానికి ముంపు పొంచి ఉందని ఇటీవలి వరదల్లో తేలిందని.. అమరావతి నిర్మాణం ఎంతో ఖర్చుతో కూడుకుందని..త్వరలో రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించేశారు. మరి అది ప్రభుత్వ ప్రకటన లేక ఆయన వ్యక్తిగతమా అన్నది పక్కన పెడితే... ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో రాజధానిపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. రాజధాని దొనకొండ తరలిస్తారని జోరుగా ప్రచారం సాగింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.ఈ సమయంలోనే ఆర్థిక మంత్రి బుగ్గన ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు.

బొత్స సత్యనారాయణ యథాలాపంగా ప్రకటన చేశారని చెబుతూనే..తాము రాజధాని వ్యతిరేకం కాదని బుగ్గన చెప్పుకొచ్చారు. రాజధానిలో అక్రమాలు జరిగాయని.. దానిపై విచారణ జరిగి నివేదిక వచ్చిన తరువాత ఏం చేయాలో నిర్ణయిస్తామంటూ మరో కామెంట్‌ చేశారు. అంటే..ఒకవైపు బొత్స ప్రకటనను ఖండిస్తూనే... అది కరెక్టనే వాదన బుగ్గన చేయడం ఎవరికి అర్థం కాని పరిస్థితి.

.

బొత్స వ్యాఖ్యలపై స్పందించిన మరో మంత్రి గౌతం రెడ్డి... రాజధానిని ఎక్కడికి తరలించడం లేదని.. అమరావతిలోనే పనులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాజధాని అమరావతే అని అంటూనే.. రాజధాని ఇబ్బందుల గురించే మాట్లాడారని బొత్సను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు.

అమరావతిని తరలించే ఉద్దేశం లేదని చెప్పారు మరో మంత్రి కొడాలి నాని. అలా అంటూనే బొత్స చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదని క్లీన్‌ సర్టిఫికేట్‌ ఇచ్చేశారు. ఇక ఎమ్మెల్యే ఆర్కే కూడా వీరి కోవలోకే చేరిపోయారు.

వైసీపీ ప్రభుత్వానికి రాజధానిపై ఇప్పటికి ఓ విధానపరమైన క్లారిటీ లేదు. అమరావతిపై త్వరలో కీలక నిర్ణయం అని ఒకరు. అక్రమాలపై నిగ్గు తేల్చాలని ఒకరు, అమరావతి సురక్షితం కాదని మరొకరు. అమరావతిని తరలించం అని ఒంకొకరు. ఇలా ఎవరికి వారు ప్రకటనలు చేసి అగ్గికి మరింత ఆజ్యం పోస్తున్నారు. రాజధానిపై వైసీపీ ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లోపించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Full View

Similar News