మట్టి గణపతే.. మహాగణపతి.. ఓరుగల్లువాసుల స్ఫూర్తి

Update: 2019-08-25 12:43 GMT

పర్యావరణ పరిరక్షణకు ఓరుగల్లువాసులు నడుంబింగిచారు. ఇందులో భాగంగా మట్టి వినాయకులను ప్రతిష్టాద్దామని ప్రతినబూనారు. గణేష్‌ మండళ్ల నిర్వాహకులు సైతం ముందుకురావడంతో పొరుగు రాష్ట్రాల నుంచి కళాకారులను తీసుకొచ్చి మట్టి గణపయ్యలను తయారు చేస్తున్నారు. POP విగ్రహాలకు ధీటుగా గడ్డి, కలపతో మట్టినిఉపయోగించి ఓరుగల్లులో బొజ్జ గణపయ్యలకు ప్రాణం పోస్తున్నారు.

వినాయక నవరాత్రి ఉత్సవాలకు వరంగల్‌ ముస్తాబవుతతోంది. అయితే గతానికి భిన్నంగా ఈ సారి ఉత్సవాలు జరగనున్నాయి. గత కొద్దికాలంగా ప్రభుత్వం, కార్పొరేషన్‌ అధికారులు మట్టి విగ్రహాలు ప్రతిష్టించాలని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఫలితంగా వరంగల్‌ నగరంలో గణేష్‌ మండళ్ల నిర్వాహకులు మట్టి గణపతులకు ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారు.

మట్టి వినాయకులపై ప్రభుత్వ, మీడియా ప్రచారం కొంత మేర ఫలించాయని చెప్పవచ్చు. ఇదే అదనుగా భావించిన మట్టి విగ్రహాల తయారీదారులు ధరలను రెట్టింపు చేసి అమ్ముతున్నారు. మట్టి గణపతులు ఐదు అడుగుల మొదలుకొని 25 అడుగుల వరకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

మట్టి విగ్రహాల ధరలు 10 వేల నుంచి 70 వేల వరకు పలుకుతున్నాయి. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను క్యాష్‌ చేసుకుంటున్నారు తయారీదారులు. అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా ఇవ్వడం కూడా తయారీదారులకు కష్టంగా మారుతోంది. అయినప్పటికీ మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఓరుగల్లు వాసులు. రేట్ల సంగతి ఎలా ఉన్నా... ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెరగడం శుభసూచికమంటున్నారు పర్యావరణ వేత్తలు. ఓరుగల్లువాసుల స్ఫూర్తి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని కోరుతున్నారు.

Similar News